
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
యాదాద్రి వెలుగు: బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం యాదాద్రి జిల్లా బీబీనగర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అసెంబ్లీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రానికి పంపిన బిల్లుకు మూడు నెలలు అయినా ఆమోదం తెలపలేదని, కనీసం తన అభిప్రాయ చెప్పలేదన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి రావలసిన నిధులపై తేవడంతో విఫలమయ్యారని విమర్శించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో నిధుల కొరతతో వైద్య సేవలు సరిగా అందడం లేదన్నారు. ప్రజా సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చేస్తే తగిన గుణపాఠం చెబుతారన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై అఖిలపక్ష పార్టీలతో చర్చించాకే కేంద్రంతో మాట్లాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఉప రాష్ట్రపతి రాజీనామాపై బీజేపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.