మహిళా పోలీసుపై లైంగిక వేధింపులు.. డీఐజీ,సీఐ సస్పెన్షన్

మహిళా పోలీసుపై లైంగిక వేధింపులు.. డీఐజీ,సీఐ సస్పెన్షన్

న్యూఢిల్లీ: మహిళా పోలీసును టార్గెట్ చేసి లైంగికంగా వేధించిన సీఆర్పీఎఫ్ డీఐజీ ఖజన్ సింగ్, సీఐ సుర్జీత్ సింగ్ పై సస్పెన్షన్ వేటు పడింది. తమ వద్ద పనిచేస్తున్న 30 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ను సెంట్రల్ రిజర్వు ఫోర్సు డీఐజీ, ఇన్స్ పెక్టర్ లిద్దరూ 2014 లో ఢిల్లీలోని వసంత్ కుంజ్ లోని ఓ ఫ్లాట్ కు తీసుకెళ్లి మూడు రోజులపాటు తనపై అత్యాచారం చేశారని.. సదరు బాధిత మహిళ పోలీసు నోరు విప్పిన ఘటన సంచలనం రేపింది. అత్యాచారాలపై దేశమంతా అట్టుడుకుతున్న సమయంలో ఈమె ధైర్యం చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బయటపడ్డ ఉదంతం పోలీసు శాఖను కుదిపేసింది. నిందితుడు,  డీఐజీ ఖజన్ సింగ్ 1986లో సియోల్ లో జరిగిన ఆసియా క్రీడల్లో రజతపతకం సాధించాడు. క్రీడల్లో ప్రతిభతోనే సీఆర్పీఎఫ్ ఉద్యోగంలో చేరి డీఐజీ స్థాయికి ఎదగగా.. ఆయన వద్ద ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న సుర్జీత్ సింగ్ జట్టు కోచ్ గా ఉన్నాడు. అర్జున అవార్డు గ్రహీత అయిన ఖజన్ సింగ్ మహిళా పోలీసును లైంగికంగా వేధించడం దుమారం రేపింది. దీంతో ప్రభుత్వం స్పందించి ఘటనపై విచారణకు ఆదేశించింది. బాధితురాలి ఆరోపణలపై విచారణ జరిపిన ఐపీఎస్ అధికారిణి చారు సిన్హా నిందితులపై ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా తేల్చింది. దీంతో కేసు దర్యాప్తుకు ఆటంకం లేకుండా  ఈ ఇద్దరు అధికారులపై సస్పెన్సన్ వేటు వేశారు ఉన్నతాధికారులు.