వరంగల్ పై మొంథా దాడి.. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం

వరంగల్ పై మొంథా దాడి.. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం
  • నీట మునిగిన కాలనీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
  • పలుచోట్ల గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
  • అధికారులను అప్రమత్తం చేసిన ప్రజాప్రతినిధులు
  • నేడు పలుచోట్ల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు

వెలుగు, నెట్​వర్క్​:మొంథా తుఫాన్​ ఉమ్మడి ఓరుగల్లు జిల్లాపై దాడి చేసింది..! పంటలు నీట మునగగా, ధాన్యం వరద పాలయ్యింది. బుధవారం ఉదయం ఓ మాదిరిగా ఉన్న వర్షం 10 గంటల తర్వాత కుండపోతగా కురిసింది. వరంగల్ ట్రై సిటీలో భారీ వర్షానికి కాలనీలన్నీ జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్, బస్టాండ్ తోపాటు రోడ్లు చెరువులను తలపించాయి. మహబూబాబాద్​జిల్లాలో రెయిన్​ ఎఫెక్ట్​ చూపింది. జిల్లాలోని చెరువులు అలుగుపోయగా, వాగులు ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. 

డోర్నకల్ లో గోల్కొండ, మానుకోటలో కోణార్క్ ఎక్స్​ప్రెస్​లు నిలిచిపోవడంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. నెల్లికుదురు మండలంలోని వావిలాలలో గర్భిణీని తీసుకెళ్లేందుకు 108 సిబ్బంది రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్టును తొలగించారు. జనగామ, ములుగు, జయశంకర్​భూపాలపల్లి జిల్లాల్లో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. 

కోతకు వచ్చిన వరి పంటలు నేలవాలగా, పత్తి తడిసి ముద్దైంది. జనం ఇండ్లకే పరిమితమయ్యారు. పలుచోట్ల స్కూళ్లలోకి నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వరదతో పట్టణ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. తుఫాన్ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. రెయిన్​ కారణంగా ఎక్కువగా ఆయా జిల్లాల కలెక్టర్లు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అధికారులతో రివ్యూలు..  

గ్రేటర్‍ వరంగల్‍ జిల్లా చుట్టూరా మొంథా తుఫాన్‍ ఎఫెక్ట్​ చూపడంతో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, వరంగల్‍ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‍ నాగరాజు జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించి జనాలకు తుఫాన్‍ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.  కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం రక్షణ కోసం టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. లోతట్టు ప్రాతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని కోరారు.