
- ఉమ్మడి నల్గొండ జిల్లాలో తయారు చేసి అమ్ముతున్న ముఠా
- హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి స్పిరిట్ కొనుగోలు
- 1/4 వంతు స్పిరిట్, 3/4 వంతుల నీరు కలిపి మద్యం తయారు
- ఏపీలో నకిలీ మద్యం తీగలాగితే.. రాష్ట్రంలో కదిలిన డొంక
- 5 వేల లీటర్లు పట్టుకున్న స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
- పొలాల్లో, కోళ్ల ఫారాల్లో ఏర్పాటు చేసిన డంపుల్లో తవ్వి స్వాధీనం
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కల్తీ లిక్కర్ మాఫియా కలకలం రేపుతోంది. ఏపీలో నకిలీ మద్యం తనిఖీల్లో తీగలాగితే.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం రామాపురంలో తయారీ డొంక కదిలింది. ఇటీవల స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు చేసిన దాడుల్లో కర్ణాటక, ఒడిశా, ఏపీలోని కల్తీ లిక్కర్ మాఫియాతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు లింకులు ఉన్నట్టు వెల్లడైంది. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక లే టార్గెట్ గా భారీగా నకిలీ మద్యాన్ని తయారు చేసేందుకు ముఠా సిద్ధమైంది. బెల్టు షాపులను లక్ష్యంగా చేసుకుని కల్తీ లిక్కర్ తయారు చేసి సరఫరా చేస్తున్నట్టు తేలింది.
ఏపీలో పోలీసుల తనిఖీల్లో తీగ లాగితే..
ఇటీవల ఏపీలోని మార్కాపురం, రేపల్లె, అమలాపురం వంటి పలు ప్రాంతాల్లో పోలీసుల జరిపిన దాడుల్లో తీగలాగితే ఇక్కడ డొంక కదిలింది. హైదరాబాద్‌లోని కృష్ణ పద్మ స్పిరిట్ కంపెనీ నుంచి టన్నుల కొద్దీ స్పిరిట్ కొనుగోలు చేసి, తెలంగాణ, ఏపీలోని సరిహద్దుల్లో సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని ఒక రైస్ మిల్లులో రహస్యంగా కల్తీ లిక్కర్ తయారు చేస్తున్నట్టు బయటపడింది. స్థానికంగా ఓ వైన్స్ లో పనిచేసే కౌంటర్ సిబ్బంది శంకర్‌తో పాటు మరికొందరు లిక్కర్ దందాలో కీలకంగా ఉన్నట్టు గుర్తించారు.
పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దందా గుట్టు వీడింది. దీంతో ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు నాలుగు రోజులుగా దాడులు నిర్వహించగా పలు చోట్ల డంప్ చేసిన స్పిరిట్ బయటపడింది. సోమవారం రామాపురం గ్రామంలోని పాత గోడౌన్ పై దాడి చేసి 831 లీటర్ల స్పిరిట్, 40 కార్టన్ల కల్తీ మద్యం బాటిల్స్,11,800 ఖాళీ బాటిల్స్,100 కేజీల మూతలు(క్యాప్స్), 7,814 లేబుల్స్, కారు, ఇతర సామగ్రిని పట్టుకున్నారు. బుధవారం రామాపురం– కందిబండ గ్రామాల మధ్యలోని వ్యవసాయ పొలంలో నకిలీ మద్యం డంప్ లను గుర్తించారు. జేసీబీలతో తవ్వి 60 కార్టన్ల(3000 బాటిల్స్) మద్యాన్ని బయటకు తీశారు. మేళ్లచెరువు లో ఎక్సైజ్ పోలీసులు దాడుల సమాచారం తెలియడంతో రైతు రంగిశెట్టి సైదేశ్వర్ రావు పొలంలో మంగళవారం రాత్రి హడావిడిగా కల్తీ మద్యం బాటిల్స్ దాచి పెట్టినట్లు తేలింది.
5 వేల లీటర్లలో దొరికింది కొంతే..
టాస్క్ ఫోర్స్ విచారణలో 5 వేల లీటర్ల స్పిరిట్ కొనుగోలు చేసినట్లు తేలింది. ఇందులో కొంత స్పిరిట్ తో తయారైన కల్తీ లిక్కర్ ఎక్కడ దాచిపెట్టారనేది తెలియడంలేదు. దర్యాప్తులో భాగంగా రామాపురం శివారులోని పొలాల్లో పూడ్చిపెట్టిన మరో 50 కాటన్ల బాటిల్స్ ను బుధవారం వెలికితీసి సీజ్ చేశారు. మిగిలిన మద్యం దాచిన ప్రాంతాలు రామాపురం చుట్టూనే ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికంగా మూతబడిన ఓ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో భారీగా నిల్వ చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇక వేపల మాధారం గ్రామం కూడా కల్తీ లిక్కర్ కు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. వేపల మాధారం గ్రామానికి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరికొన్ని మద్యం కార్టన్లు దొరకడంతో ఆరోపణలకు బలం చేకూరింది.
ఇప్పటికే మేళ్లచెర్వులో తయారైన మద్యం లోకల్ వైన్స్, బెల్ట్ షాపులకు సరఫరా జరిగినట్లు తెలసింది. ఈ దందా బయటకు రావడంతో ఇందులో కొన్ని బెల్ట్ షాపులు మూసివేశారు. ఓ వైన్స్ ను కూడా సీజ్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు హుజూర్ నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. మరికొందరిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. కొనుగోలు చేసిన స్పిరిట్ అంతా బయటపడే దాకా దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఖరీదైన బ్రాండ్ల బాటిల్స్ సేకరించి..
ముందుగా ఖరీదైన మద్యం బ్రాండ్ల బాటిల్స్ సేకరించి, వాటికి మూతలు, లేబుళ్లను తయారు చేసుకుంటున్నారు. 1/4 వంతు స్పిరిట్, 3/4 వంతుల నీరు కలిపి మద్యం తయారు చేసి బాటిల్స్ లో నింపి ఫేక్ లేబుల్స్ అంటించి సీల్ వేస్తున్నారు. బాటిల్ మూతల నుంచి హాలోగ్రామ్ వరకు అన్నీ ఒరిజినల్ బ్రాండ్ ను పోలినట్టుగా ఉండేలా చూసుకుంటున్నారు. నకిలీ బాటిల్ అని గుర్తించకుండా స్థానిక వైన్ షాపుల్లో కొన్నాళ్లుగా అమ్ముతున్నట్టు, అంతేకాకుండా పులిచింతల ప్రాజెక్టు డ్యామ్ మీదుగా ఖాళీ సిమెంట్ ట్యాంకర్లు, కార్లు, పడవల ద్వారా ఏపీలోకి రవాణా చేసినట్టు తేలింది.
కరోనా కాలం నుంచే కుటీర పరిశ్రమగా ప్రారంభించి, విస్తరించి, రవాణా చేస్తున్నా.. దందాపై హుజూర్‌నగర్ ఎక్సైజ్ పోలీసులకు తెలియకపోవడంతో అనుమానాలు వస్తున్నాయి. స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేయడంతో కల్తీ మద్యం దందాలో స్థానిక ఎక్సైజ్ పోలీసుల కూడా కుమ్మక్కు అయ్యారనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కల్తీ లిక్కర్ తయారీ దందాలో ఎవరెవరి పాత్ర ఉంది ? ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు? ఎక్కడికి సప్లై చేశారు ? మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చారనే కోణంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.