
దేవరకొండ(కొండమల్లేపల్లి), వెలుగు: వరద ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదేశించారు. భారీ వర్షాలకు జలమయమైన కొండమల్లేపల్లి మండలంలోని గౌరికుంట తండాలో బుధవారం ఆయన పర్యటించారు. వర్షం వచ్చినప్పుడల్లా తమ ఇండ్లలోకి నీరు చేరుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఆయన సమస్య పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ముంపునకు గురైన తండావాసుల్లో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు దేవరకొండ పట్టణంలో ఉదయం మార్నింగ్ వాక్ చేసి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మూడో, పదో వార్డుల్లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. మార్కెట్ యార్డులో వివిధ మండలాలకు చెందిన 166 మంది లబ్ధిదారులకు రూ.57.46 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నాయిని జమున మాధవరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ నరసింహ, పీఏసీఎస్చైర్మన్లు వేణుధర్ రెడ్డి, బిక్కు నాయక్, రుక్మారెడ్డి, మండల అధ్యక్షుడు వేమన్ రెడ్డి, ఆర్డీవో రమణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.