ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్​లో తర్జనభర్జన

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్​లో తర్జనభర్జన
  • స్థానిక లీడర్ల అభిప్రాయాల మేరకే ముందుకెళ్లాలని నిర్ణయం
  • సీనియర్ ​లీడర్లకు జిల్లాలవారీగా బాధ్యతలు
  • ఖర్చు భయంతో పోటీకి వెనుకాడుతున్న నేతలు

నల్గొండ, వెలుగు: లోకల్​ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అన్న అంశం మీద  కాంగ్రెస్​లో తర్జన భర్జనలు సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లోకల్​బాడీస్​లో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నప్పటికీ ఏ జిల్లాలోనూ సొంతంగా  గెలిచే సంఖ్యాబలం లేకపోవడంతో పీసీసీ పెద్దలు సందిగ్ధంలో పడ్డారు. స్టేట్​లో  రాజకీయ పరిణామాలు మారుతున్నందున జిల్లాలవారీగా పోటీ మీద నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. స్థానికంగా పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకుని పోటీపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను ఆయా జిల్లాల సీనియర్​ నేతలకు అప్పగించారు. దీంతో డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్​చార్జిలు, ముఖ్యమైన లీడర్లతో చర్చిస్తున్నారు. పోటీ చేసేందుకు ఎవరైనా ఆసక్తిగా ఉన్నారా.. ఉంటే వారికున్న కెపాసిటీ ఏమిటి? అన్న అంశాలపై ఫోకస్​ పెడుతున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి  పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రె డ్డి, సీఎల్పీ మాజీ లీడర్ కుందూరు జానారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. 
అసంతృప్తవాదులపై ఆశలు 
రాష్ట్రంలోని 12 లోకల్​బాడీ ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చాయి. ఫండ్స్, పవర్స్​ లేక చాలా కాలంగా అసంతృప్తితో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఈ ఎన్నికలను వారికి అనుకూలంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. తమకు గుర్తింపు, అధికారాలు కావాలని డిమాండ్​ చేస్తున్నవారిలో ఎక్కువ మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నారు. ఇప్పటికే ఎంపీటీసీల సంఘం తాము ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ క్యాండిడేట్లను కూడా ప్రకటించింది. ఈ పరిణామాలు కాంగ్రెస్​లో ఆశలు పెంచుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్​ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. పార్టీ క్యాండిడేట్​ సునాయాసంగా గెలవగలిగేంత బలం ఉంది. ఎక్కడా పైసా ఖర్చు చేయకుండానే గెలుస్తామని గులాబీ లీడర్లు ధీమాగా ఉన్నారు. హుజూరాబాద్​లో  ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్​ టీఆర్ఎస్​కు ఒకటిరెండు చోట్ల అయినా షాక్​ ఇవ్వాలని ఆలోచిస్తోంది. తీవ్ర అసంతృప్తితో ఉన్న అధికార పార్టీ ఓటర్ల మద్దతు కూడగట్టగలిగే ఆర్థిక, అంగ బలాలున్న క్యాండిడేట్​ముందుకొస్తే మ్యాజిక్​ చేయాలని భావిస్తున్న పీసీసీ నేతలు అలాంటి వాళ్లకోసం వెతుకుతుండడం విశేషం.  
ఖర్చుకు వెనకడుగు
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికంటేనే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. అందువల్లే చాలామంది క్యాండిడేట్లు ముందుకు రావట్లేదు. స్టేట్​లో మిగతా జిల్లాలతో పోల్చుకుంటే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్​స్ట్రాంగ్​గా ఉంది. అయినా ఎమ్మెల్సీ ఓటర్ల సంఖ్య చెప్పుకోతగినంత లేదు. ఉమ్మడి జిల్లాలో 1,271 మంది ఓటర్లుంటే అందులో 284 మంది మాత్రమే కాంగ్రెస్ వాళ్లు. కాంగ్రెస్​నుంచి గెలిచిన 350లో 66 మంది ఆ తర్వాత  పార్టీ మారారు. ఈ పరిస్థితిలో పోటీకి దిగితే ఓటర్లను ఆకట్టుకోవడానికి, కాపాడుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందని వెనుకాడుతున్నారు. క్యాంపులను నిర్వహిస్తే ఒక్కో ఓటరుకు కనీసం రూ. లక్ష ఖర్చయినా దాదాపు మూడు కోట్ల వరకు పెట్టుకోవాల్సిఉంటుందని, ఇంత చేసినా గెలుస్తామన్న నమ్మకం లేదని అంటున్నారు. 2 019లో జరిగిన బైపోల్​లో  కాంగ్రెస్ ఓటర్లే మెజార్టీగా ఉన్నప్పటికీ  చాలామంది టీఆర్ఎస్​లో చేరారు. దాంతో పార్టీ క్యాండిడేట్​ ఓడిపోయారు. రెండు క్యాంపుల నుంచి ఓటర్లు  లబ్ధి పొందారని,  ఆ ఎన్నికల్లో  దాదాపు  100 కోట్లు ఖర్చయిందన్న ప్రచారం జరిగింది.  పోటీ అనివార్యమైతే నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, చందంపేట మండలం చింత్రియాల పీఏసీఎస్ చైర్మన్ జాల నర్సింహారెడ్డి, నల్గొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పేర్లను పరిశీలనలో ఉండనున్నాయి. ఈ ఎన్నికల్లో  కాంగ్రెస్ పోటీలో ఉండాలని టీఆర్ఎస్ ఓటర్లు బలంగా కోరుకుంటున్నారు. గట్టి పోటీ  లేకపోతే తమను కనీసం లెక్క కూడా చేయరని, కాంగ్రెస్  బరిలో ఉంటేనే తమకు డిమాండ్​ ఉంటుందని, ఎంతోకొంత లబ్ధి చేకూరుతుందని ఆశిస్తున్నారు. 
ఫోరం క్యాండిడేట్లు  కాంగ్రెసోళ్లే..
ఎమ్మెల్సీ ఎన్నికలకు  రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ తన క్యాండిడెట్లను ప్రకటించింది.తొమ్మిది జిల్లాలకు క్యాండిడేట్లను ప్రకటించగా అందులో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులే. ఖమ్మం, మహబూబ్​నగర్, కరీంనగర్ క్యాండిడేట్లు టీఆర్ఎస్ వాళ్లు కాగా, నిజామాబాద్ క్యాండిడేట్​బీజేపీ ఎంపీటీసీ. నల్గొండ నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీటీసీ కుడుదల నగేష్ (కాంగ్రెస్) పేరు డిక్లేర్ చేశారు.