యాదాద్రి జిల్లాలో కుక్కల దాడిలో 80 గొర్లు మృతి

యాదాద్రి జిల్లాలో  కుక్కల దాడిలో  80 గొర్లు మృతి
  • యాదాద్రి జిల్లాలో ఘటన

యాదగిరిగుట్ట, వెలుగు : కుక్కలు దాడి చేసి 80 గొర్లను చంపేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. ఆలేరుకు చెందిన ఎగ్గిడి సంపత్ కొన్నేండ్లుగా గొర్లను పెంచుతుండగా.. బుధవారం రాత్రి యాదగిరిగుట్ట కాచారం శివారులోని దొడ్లో తోలి ఇంటికెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి చూడగా 80 గొర్లు చనిపోయాయి. మరో 20 గొర్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు, వెటర్నరీ సిబ్బంది వెళ్లి పంచనామా చేశారు. కాగా అర్ధరాత్రి కుక్కలు దొడ్లోని గొర్ల మందపై దాడి చేయడంతో చనిపోయాయని, రూ.10 లక్షల వరకు నష్టపోయానని బాధితుడు వాపోయాడు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

 ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బాధితుడు సంపత్ ను ఫోన్ లో పరామర్శించారు. ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఏడాది కిందట  మందపై కుక్కలు దాడి చేసి 30 గొర్లను చంపేశాయని బాధితుడు సంపత్ పేర్కొన్నాడు. అప్పుడు కూడా అధికారులు వచ్చి చూశారని, పరిహారం ఇప్పించలేదని ఆవేదనతో చెప్పాడు.