డ్రైవింగ్ లైసెన్స్ కు రోడ్ సేఫ్టీ టెస్ట్ పాస్ కావాల్సిందే

డ్రైవింగ్ లైసెన్స్ కు   రోడ్ సేఫ్టీ టెస్ట్ పాస్ కావాల్సిందే
  • త్వరలో కొత్త విధానం 
  • అమలుకు ఆర్టీఏ ప్రతిపాదనలు
  • సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ టెస్ట్  

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఇకపై డ్రైవింగ్  లైసెన్స్  కావాలంటే తప్పనిసరిగా రోడ్ సేఫ్టీ టెస్ట్ పాస్ కావాల్సిందే. త్వరలో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురావాలని ఆర్టీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు అభ్యర్థులు రెండు టెస్టులు పాసైతేనే పర్మినెంట్​ లైసెన్స్​జారీ చేస్తున్నారు. ఇందులో ఎల్ఎల్ఆర్ (లెర్నర్​ లైసెన్స్​రిజిస్ట్రేషన్) టెస్ట్, తర్వాత  డ్రైవింగ్​స్కిల్​ టెస్ట్​మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులు పాసయితే పర్మినెంట్​ లైసెన్స్  జారీ చేస్తున్నారు. కానీ, ఇక నుంచి ఈ రెండు టెస్టుల కంటే  ముందు రోడ్ సేఫ్టీ టెస్ట్  పాస్ కావాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రోడ్  సేఫ్టీ రూల్స్​ తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఈ కొత్త రూల్​ అమలు చేయాలని నిర్ణయించారు. దీని కోసం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నివేదిక రాగానే అమలు చేయనున్నారు. 

వందల సంఖ్యలో దరఖాస్తులు

రోజూ ఒక్కో ఆర్టీఏ ఆఫీసులకు వందల సంఖ్యలో కొత్త లైసెన్సులు, పర్మినెంట్​ లైసెన్సుల కోసం దరఖాస్తులు వస్తుంటాయి. కొత్తగా లైసెన్స్​ పొందే వారికి స్లాట్​ బుక్​ చేసుకున్న రోజే ఆర్టీఏ ఆఫీసులో ట్రాఫిక్​  రూల్స్​పై కంప్యూటర్​లో పరీక్ష పెడతారు. అందులో పాస్​అయితే వెంటనే లర్నింగ్​ లైసెన్స్​ ఇస్తారు. దీని వ్యాలిడిటీ 6 నెలల వరకు ఉంటుంది. ఈలోపు పర్మినెంట్​ లైసెన్స్ ​కోసం దరఖాస్తు చేసుకోవాలి. స్లాట్​బుక్​చేసుకున్న రోజు దరఖాస్తుదారు టూవీలర్​ లేదా కారును టెస్ట్​ట్రాక్​పై నడపాల్సి ఉంటుంది.

ఓకే అయితే, పర్మినెంట్​లైసెన్స్​జారీ చేస్తారు. కానీ, చాలా మందికి లైసెన్స్​ఉన్నా డ్రైవింగ్​లో సరైన నైపుణ్యం ఉండడం లేదు. ట్రాఫిక్​ రూల్స్​ పాటించకపోవడం, నిర్లక్ష్యపు డ్రైవింగ్​ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నివారించడానికి అధికారులు ట్రాఫిక్​ నిబంధనలు తెలిసేలా లైసెన్సుల జారీకి ముందే రోడ్​సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు టెస్ట్​ నిర్వహించనున్నారు. ఈ టెస్ట్​ పాసైతే సర్టిఫైడ్​ నంబర్​ ఇస్తారు. ఈ నంబర్ ​ ద్వారా లర్నింగ్​కు దరఖాస్తు చేసుకోవాలి.