ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలో పేదల కోసం నిర్మించిన ఇండ్ల ఆడిటింగ్ ప్రక్రియ పకడ్బందీగా జరుగుతోందని హౌసింగ్ ఈఈ శ్రీనివాస రావు తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలోని వైఎస్సార్ నగర్ కాలనీ, మల్లెమడుగు లలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం ద్వారా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఆడిటింగ్ ప్రక్రియను కేంద్ర బృందాలతో కలిసి శ్రీనివాస రావు నిర్వహించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ క్రింద లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఇండ్లు అందించిన వారి వివరాలను సేకరించి ఇంటింటికి తిరుగుతూ సమస్యలు ఏమైనా ఉన్నాయా, మౌలిక వసతులు కల్పన, ఇంటిలో ఉన్న లబ్ధిదారుల వివరాలు పోర్టల్ లోని వివరాలతో సరి చూస్తూ కేంద్ర బృందం ఆడిట్ నిర్వహించింది.
వైఎస్సార్ నగర్ లో నిర్మించిన 204 ఇండ్లు, మల్లెమడుగులో నిర్మించిన 106 ఇండ్లకు ఆడిటింగ్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. ఆడిటింగ్ అనంతరం కేంద్ర బృందం అధికారులు లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. కాలనీలో కల్పించిన వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఆడిటింగ్ బృందాలలో ఎస్టీఎం సాయి జ్ఞానేందర్, ఎస్ఆర్పీ చెన్న కేశవులు, ఏపీసీ అంజగౌడ్, టీడబ్ల్యూఐడీ డీఈ బి.రాజు, ఆర్ అండ్ బీ ఏఈఈ కె. లక్ష్మీనారాయణ, హౌజింగ్ సీఎల్టీసీ సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.