బీటెక్ చేసింది.. గంజాయి అమ్ముతూ పట్టుపడింది

బీటెక్ చేసింది.. గంజాయి అమ్ముతూ పట్టుపడింది
  • చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానంటూ తల్లిదండ్రులకు సమాచారం
  • జీతం చాలడంలేదని ప్రియుడితో కలసి గంజాయి అమ్మకంలో దిగింది
  • శ్రీకాకుళంకు చెందిన ఆద్య అలియాస్ రేణుక(25) బెంగళూరులో అరెస్ట్
  • ఆమె ప్రియుడు సిద్ధార్ధతోపాటు మరో నిందితుడు పరారీ

బెంగళూరు: తొందరగా డబ్బులు సంపాదించాలనే తాపత్రయంలో తప్పుడు మార్గంలోకి వెళ్లిన యువ ఇంజనీర్ ఉదంతం ఇది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆద్య అలియాస్ రేణుక (25) బెంగళూరు పోలీసులకు పట్టుపడి కటకటాలు లెక్కిస్తోంది. ప్రియుడి మాయమాటలు నమ్మి అత్యాశకు వెళ్లి జైలుపాలైంది. వివరాలు ఇలా ఉన్నాయి. 
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆద్య అలియాస్ రేణుక(25) చెన్నైలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. బీటెక్ చదువుతున్నప్పుడే తన క్లాస్ మేట్ సిద్ధార్థతో ప్రేమలో పడింది. వీరి బీటెక్ కోర్సు అయిపోయాక రేణుకకు ఈజీగానే ఉద్యోగం దొరికింది. అయితే ఏ ఉద్యోగం దొరకని సిద్దార్థ డబ్బులు సులభంగా సంపాదించుకునే అవకాశాల కోసం చూస్తూ గంజాయి వ్యాపారంలోకి దిగాడు. తన ప్రియురాలు రేణుక కు వచ్చే జీతం చాలా చిన్నదని చెబుతూ.. తనతో కలసి గంజాయి వ్యాపారంలోకి దిగితే సులభంగా లక్షలు సంపాదించుకుని తొందరగా జీవితంలో సెటిలైపోదామని ఆశలు రేపాడు. తనకొచ్చే జీతం డబ్బులతో తాను ఖర్చులకు కొంత ఉంచుకుని మిగతా డబ్బును తల్లిదండ్రులకు పంపిస్తూ కష్టాలు పడుతున్న రేణుకకు తన జీతం చాలా తక్కువ అనిపించింది. ప్రియుడి మాటలు నమ్మి గంజాయి వ్యాపారంలోకి దిగింది. ఈ క్రమంలోనే బెంగళూరులో లాక్ డౌన్ సమయంలో గంజాయికి మంచి డిమాండ్ ఉందని ప్రియుడు చెప్పడంతో అతనితో కలసి బెంగళూరుకు వెళ్లింది. 
గత ఏప్రిల్ నెలలో లాక్ డౌన్ ప్రకటనకు ముందు బెంగళూరుకు వెళ్లి మారథల్లి ప్రాంతంలో ఒక హోటల్ లో గది తీసుకుంది. సిద్దార్ద మరో పార్టనర్ గోపాల్ రేణుకకు గంజాయి ఇచ్చాడు. వాళ్లు ఒడిశా నుంచి విశాఖ పట్టణం మీదుగా బెంగళూరుకు గంజాయి తీసుకుని వచ్చారు. గంజాయిని సప్లయి  చేయడానికి సిద్దార్ధ తన ప్రియురాలు రేణుకను పంపేవాడు. ఆమె వెంట తన మరో పార్ట్ నర్ సుధాన్సను వెంట పంపేవాడు. బీహార్ కు చెందిన సుధాన్షు బెంగళూరుకు వచ్చి మేనేజ్ మెంట్ కోర్సు చదువుతూ సిద్ధార్థ్ కు పరిచయం అయ్యాడు. అతను ఆశలు పెట్టడంతో గంజాయి సరఫరా వ్యపారంలోకి దిగాడు. 
బెంగళూరు నగరంలోని ఐటీఐ పార్క్ వద్ద గంజయి అమ్మేందుకు బయలుదేరారు. విశ్వసనీయ సమాచారం మేరకు బెంగళూరు సబ్ ఇన్స్ పెక్టర్ ఎన్.శోభ తన బృందంతో దాడి చేసి పట్టుకున్నారు. వీరు తమ దగ్గర 10 పాకెట్లలో దాచుకున్న 2500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద 6500 నగదు పట్టుపడింది. వీరిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుని వీరి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గంజాయి మూలలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. వీరు పట్టుపడడం గమనించి పరారైన రేణుక ప్రియుడు సిద్ధార్థ కోసం గాలింపు చేపట్టారు.