రైతు ఆత్మహత్య.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారణమని సెల్ఫీ వీడియో

రైతు ఆత్మహత్య.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారణమని సెల్ఫీ వీడియో

మునగాల, వెలుగు : పురుగుల మందు తాగి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తే కారణమని సెల్ఫీ తీయడంతో అతడిపై చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు,  బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో గురువారం జరిగింది. ఎస్సై ప్రవీణ్‌‌కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన సిరికొండ రాజేశ్‌‌ (40) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నెల 13న ఉదయం తన పొలం వద్దకు వెళ్లి ‘నేను స్టార్టర్లు, మోటార్లు చోరీ చేస్తున్నానని గ్రామానికి దేవరం వెంకట్‌‌రెడ్డి ఆరోపిస్తున్నాడు, ఇదే విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయించాడు, తన చావుకు వెంకట్‌‌రెడ్డే కారణం’ అని సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగాడు. 

తర్వాత భార్య సునీత, బావమరిది సైదులుకు ఫోన్‌‌ చేసి చెప్పడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని కోదాడలోని ప్రైవేట్ హాస్పిటల్‌‌కు, అక్కడి నుంచి ఖమ్మంలోని హాస్పిటల్‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటూ రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య సునీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతుడి ఫ్యామిలీకి న్యాయం చేయాలంటూ ఎన్‌‌హెచ్‌‌ 65పై రాస్తారోకోకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో డెడ్‌‌బాడీని దేవరం వెంకట్‌‌రెడ్డి ఇంటి ముందు పెట్టి మరోసారి ఆందోళనకు దిగారు. మృతుడి ఫ్యామిలీకి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.