
- యాదాద్రి జిల్లాలో 8,195 మంది అర్హులు
- ఇన్చార్జి మంత్రి వద్దకు చేరిన జాబితా
- 10 నుంచి కొత్త ఇండ్ల నిర్మాణానికి ముగ్గు
యాదాద్రి, వెలుగు : మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ సర్వే ముగిసింది. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఇచ్చిన జాబితా ఆధారంగా సర్వే నిర్వహించిన ఆఫీసర్లు అర్హులను గుర్తించారు. ఈ జాబితా ఇన్చార్జి మంత్రి వద్దకు చేరింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లో 2,01,977 అప్లికేషన్లు రాగా, వీటిలో 52,109 ఓకే చేశారు. అయితే వీరిలో ఇండ్లు లేకుండా సొంత ఇంటి స్థలం ఉన్న వారిని ఎల్-–1 జాబితాలో చేర్చింది. ఇంటి స్థలం, ఇండ్లు లేనివారిని ఎల్–2లో చేర్చింది. గతంలో ఇండ్లు శాంక్షన్అయిన వారిని, స్లాబ్ఇండ్లు ఉన్న వారిని ఎల్–3లో చేర్చింది. ఈఎల్–3 జాబితాలో ఉన్న వారికి ఇండ్లు వచ్చే అవకాశం లేనట్టే. అయితే పొరపాటున ఎల్–3 జాబితాలో చేరినవారిని స్థానిక ఎమ్మెల్యే అనుమతితో ఎల్–1 జాబితాలో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముగిసిన సర్వే.. 8,195 మంది అర్హులు..
ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు జిల్లాలోనే ఉన్నాయి. మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని రెండు మండలాల చొప్పున, నకిరేకల్నియోజకవర్గంలోని ఒక మండలం జిల్లాలోనే ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు ఎల్–1 జాబితాలోని 8,736 మందిని మొదటి విడత అర్హులుగా గుర్తించి, ఆ జాబితాను హౌసింగ్డిపార్ట్మెంట్కు అప్పగించింది. అయినప్పటికీ.. నిజమైన అర్హులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో గత నెల చివరి వారం నుంచి ఈనెల మొదటి వారం వరకు ఎంపీడీవోలతో కూడిన కమిటీలు సర్వే నిర్వహించాయి. ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాలో 8,195 మందిని అర్హులుగా గుర్తించారు.
రెండెకరాలను మించి తరి ఉంటే..
లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. నిజమైన అర్హులకు ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రూల్స్ప్రేమ్ చేసింది. ఈ రూల్స్ప్రకారం రెండు ఎకరాలకు మించి తరి పొలం, ఐదెకరాల మెట్టకు మించినా అనర్హులుగా పేర్కొంది. దీంతోపాటు కిసాన్క్రెడిట్కార్డు (కేసీసీ) రూ.50 వేలకు మించినా అనర్హులే అని పేర్కొంది. వీటితోపాటు ట్రాక్టర్సహా ఇతర ఫోర్ వీలర్ వెహికల్ ఏది ఉన్నా.. ఇందిరమ్మ ఇండ్లకు అనర్హుడేనని స్పష్టం చేసింది. ఈ వి ధమైన రూల్స్ కారణంగా ఎమ్మెల్యేలతో కూడిన ఇందిరమ్మ ఇండ్ల కమిటీ గుర్తించిన మొదటి జాబితా నుంచి 541 మందిని తొలగించారు. మిగిలిన వారి లిస్ట్ ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పంపించనున్నారు.
10 నుంచి కొత్త ఇండ్లకు ముగ్గు..
ఆఫీసర్లు పంపిన జాబితాకు ఇన్చార్జి మంత్రి తుమ్మల నుంచి ఆమోదం రాగానే కొత్త ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించనున్నారు. ఈనెల 10 నుంచి పండుగ వాతావారణంలో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో కొత్తగా మంజూరైన ఇండ్లకు ముగ్గుపోయనున్నారు. జనవరి 26న జిల్లాలోని 17 మండలాల్లోని 17 గ్రామాల్లో 758 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి. వీటిలో ఇప్పటికే 480 ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యాయి. ఇందులో రూల్స్‌కు విరుద్ధంగా నిర్మించిన కొందరు లబ్ధిదారులకు ఇలా అయితే బిల్స్ రావని ఆఫీసర్లు హెచ్చరించారు. కాగా 132 ఇండ్లు బేస్మెంట్ లెవల్‌కు చేరుకున్నాయి. ఇందులో 106 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ అయ్యాయి.
పూరెస్ట్.. పూర్ పద్దతిలో లబ్ధిదారుల ఎంపిక
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో పూరెస్ట్.. పూర్ పద్దతిలో లబ్ధిదారుల ఎంపిక జరిగింది. లబ్ధిదారులు రూల్స్‌కు అనుగుణంగా ఇండ్లు నిర్మించుకోవాలి. ఇంటి నిర్మాణం ముగిసేలోగా నాలుగు విడతల్లో రూ.5 లక్షలు లబ్ధిదారుల అకౌంట్లో జమ అవుతుంది.
విజయ్‌సింగ్, పీడీ హౌసింగ్, యాదాద్రి