ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన

ముంపు ప్రాంతాల్లో అధికారుల పర్యటన
  • ఇండ్లు ఖాళీ చేయించి సూచనలు

భైంసా, వెలుగు: భైంసాలోని గడ్డెన్న ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు 37వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో భైంసాలోని పలు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. ఈ ప్రాంతాల్లో శుక్రవారం ఉమ్మడి జిల్లా స్పెషల్​ ఆఫీసర్​హరి కిరణ్​, కలెక్టర్​అభిలాష అభినవ్​పర్యటించారు ముందుగా ముంపు ముప్పు ఉన్న రాహల్​నగర్, ఆటో నగర్​కు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. 

ఈ రెండు ప్రాంతాల్లోని నివాస గృహాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించి వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులకు స్థానికులు తమ సమస్యలు వివరించారు. మూడు నాలుగేండ్లుగా గడ్డెన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తితే తమ కాలనీలను వరద ముంచెత్తుతోందని, రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

అప్రమత్తంగా ఉన్నాం: కలెక్టర్​

జిల్లాలో గత మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్​అభిలాష అభినవ్​ పేర్కొన్నారు. భైంసాలో పర్యటించిన కలెక్టర్​మీడియాతో మాట్లాడారు. నిర్మల్, భైంసాలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఎలాంటి ముంపు ప్రాంతాల్లోని జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. 

బాసర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో రెస్క్యూ టీమ్​ను అందుబాటులో ఉంచామని, అలర్ట్​గా ఉన్నామన్నారు. అడిషనల్​కలెక్టర్ ​కిశోర్​ కుమార్, సబ్​ కలెక్టర్​ సంకేత్​ కుమార్, తహసీల్దార్​ ప్రవీణ్​కుమార్, మున్సిపల్​ కమిషనర్​ రాజేశ్ కుమార్ ​తదితరులున్నారు. 

యుద్ధప్రాతిపదికన రోడ్ల రిపేర్లు

కుంటాల, వెలుగు: భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల రిపేర్లు యుద్ధప్రాతిపదికన చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కుంటాల మండలంలోని అందకుర్ సమీపంలో దెబ్బతిన్న రోడ్డు, పంటలను ఆమె పరిశీలించారు. గుంతలు పూడ్చి రవాణా సౌకర్యం కల్పించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టలేదని, అధికారులు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్ కమల్ సింగ్, స్థానిక అధికారులు ఉన్నారు.