ఫ్రెంచ్​ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్

ఫ్రెంచ్​ రచయిత్రికి సాహిత్యంలో నోబెల్

మన గురించి మనం చెప్పుకునేటప్పుడు కాసిన్ని అబద్దాలు, ఎన్నోకొన్ని గొప్పలు  కచ్చితంగా ఉంటాయి. అంతేకాదు, ఆ రెండిటి మధ్య బయటపెట్టలేని కొన్ని నిజాలు దాక్కొని ఉంటాయి. అవి మనల్ని బాధ పెట్టేవి కావచ్చు.. అవమానించేవి, అనుమానించేవి కావచ్చు. అందుకే వాటిని ఎవరికీ చెప్పుకోలేం. గొప్ప వ్యక్తులుగా పేరు పొందిన వాళ్ల ఆత్మకథల్లోనూ ఇలాంటి బయటపడని రహస్యాలు బోలెడు. కానీ, ఆమె మాత్రం ఇలాంటి దాపరికానికి పూర్తి విరుద్ధం. తెలిసీ తెలియని వయసులో వేసిన తప్పటడుగు నుంచి తెలిసి చేసిన తప్పుల వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నిటినీ రచనలుగా మార్చింది. అది కూడా అల్లాటప్పాగా  కాదు. అందరికీ అర్థమయ్యే భాషలో,  ఆపకుండా చదివించే శైలిలో అద్భుతంగా రాసింది. అందుకే సాహిత్యంలో అత్యున్నత పురస్కారమైన ‘నోబెల్​’ అవార్డు ఆమెను వరించింది. ఆమెనే 82 ఏండ్ల ఫ్రెంచ్​ రచయిత్రి యానీ ఎర్నో.

ఫ్రాన్స్​ ఈశాన్య ప్రాంతమైన నొర్మాండీ ప్రావిన్స్​లోని ‘లిలిబోన్’​ అనే ఊళ్లో1940లో పుట్టింది యానీ ఎర్నో. తల్లిదండ్రులు ఫ్రాన్స్​లో దిగువ తరగతిగా చెప్పే ‘వర్కింగ్​క్లాస్’​ కేటగిరీకి చెందినవాళ్లు. కూలి పనులు చేసేవాళ్లు. కొన్నేండ్ల తర్వాత యానీ కుటుంబం ‘ఇవెటోట్’ టౌన్​కు చేరుకుంది. అక్కడ యానీ తల్లిదండ్రులు చిన్న కిరాణా, కాఫీ షాపు పెట్టారు. ఆ టౌన్​లోనే ఒక ప్రైవేట్​ కేథలిక్​ సెకండరీ స్కూల్​లో యానీ చేరింది. అక్కడ మధ్యతరగతి (మిడిల్​ క్లాస్)​ కుటుంబాల అమ్మాయిలు ఎక్కువగా ఉండేవాళ్లు. వాళ్లు ‘వర్కింగ్​క్లాస్’ ​కేటగిరీ అంటూ యానీని ఎగతాళి చేసేవాళ్లు. అక్కడ చాలా అవమానాలు ఎదుర్కొంది యానీ. ఆమె తల్లిదండ్రులకు టౌన్​లో ఇలాంటి వివక్షే ఎదురైంది. 

సమ్మర్​ క్యాంప్​లో చేరి.. 

పద్దెనిమిదేండ్ల వయసులో ఇంటి నుంచి బయటకొచ్చింది యానీ. ఒక సమ్మర్​ క్యాంప్​లో చేరి, చిన్నపిల్లలను చూసుకునేది. అక్కడ యానీ వయసులోని ఆడపిల్లలు మరికొందరు ఉండేవాళ్లు. దాంతో అక్కడున్నప్పుడే స్వేచ్ఛా జీవితానికి అలవాటుపడింది యానీ. రెండేండ్ల తర్వాత లండన్​ చేరుకుంది. అక్కడ చాలా ఇండ్లల్లో పనిమనిషిగా చేరింది. యజమానుల పిల్లల్ని చూసుకునేది. ఇంటిపని, వంటపని చేసేది. బదులుగా ఆమెను తమ ఇంట్లోనే ఉండనివ్వడంతోపాటు మూడుపూటలా భోజనం పెట్టేవాళ్లు. వారానికోసారి పాకెట్​ మనీ ఇచ్చేవాళ్లు. అలా కొన్ని రోజులు గడిచాక మళ్లీ సొంత దేశానికి చేరుకుంది. ఈసారి ‘రోవెన్’​ సిటీలోని ఒక కాలేజీలో ప్రైమరీ టీచర్​ ట్రైనింగ్​ ప్రోగ్రామ్​లో చేరింది. అప్పుడే ఒక నవల రాసింది. కానీ, అది పబ్లిష్​ కాలేదు. 

పెండ్లి.. పిల్లలు.. పుస్తకాలు

టీచర్​ ట్రైనింగ్​లో ఉండగానే యానీకి పెండ్లి అయింది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అదే టైంలో సెకండరీ స్కూల్​ టీచర్​ ఉద్యోగం వచ్చింది. ‘యాన్సీ’ సిటీలోని ఒక స్కూల్లో ఫ్రెంచ్​ పాఠాలు చెప్పేది. అనారోగ్యంతో తండ్రి చనిపోయాడని తెలియడంతో 1967లో సొంతూరుకి వెళ్లింది. అక్కడ నుంచి వచ్చాక ఆమెలో చాలా మార్పు వచ్చింది. ఖాళీ టైంలో పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. అలా ఆమె రాసిన మొదటి నవల ‘క్లీన్డ్​ ఔట్’1974లో పబ్లిష్​ అయింది. ఆ పుస్తకానికి చాలా పేరొచ్చింది. ఆ తర్వాత 1977 ‘డూ వాట్​ దే సే ఆర్​ ఎల్స్​’ రిలీజైంది. అదే సంవత్సరంలోనే ఉద్యోగాన్ని వదిలిపెట్టిన యానీ.. కుటుంబంతో కలిసి పారిస్​కు దగ్గరలోని ‘సెర్గీ–పొంటాయిస్​’ టౌను చేరింది. అక్కడ డిస్టెన్స్​ ఎడ్యుకేషన్​ సెంటర్​లో జాబ్​ సంపాదించింది. కానీ,1980లో భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ రచనల మీద దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు దాదాపు 30 నవలలు రాసింది. వాటిలో ‘ది ఫ్రోజన్​ ఉమన్’​, ‘ఏ మ్యాన్స్​ ప్లేస్​’,‘ఎ ఉమన్స్​ స్టోరీ, ‘సింపుల్​ పాషన్​’,‘షేమ్​’ వంటివి ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి. 2000 సంవత్సరంలో జాబ్​ నుంచి రిటైర్​ అయిన యానీ.. అదే సంవత్సరంలో ‘హ్యాపెనింగ్​’ నవలను మార్కెట్లోకి తెచ్చింది. ఈ పుస్తకంతో యానీ పేరు సాహిత్య ప్రపంచంలో మార్మోగిపోయింది. ఆ మరుసటి ఏడాది వచ్చిన ‘గెటింగ్​ లాస్ట్​’, ‘ది ఇయర్స్​’, ‘ఎ గర్ల్స్​ స్టోరీ’ నవలలు కూడా అంతేస్థాయిలో పేరు తెచ్చాయి.

జీవితానుభవాలే కథలుగా..

సాహిత్యంలో యానీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి కారణం ఆమె ఎంచుకున్న కథావస్తువు. తన జీవితంలో, తన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్లో జరిగిన సంఘటనలే ఆమె రచనలు. ముఖ్యంగా తనకు ఎదురైన కష్టాలు, కన్నీళ్లు, మనుషుల స్వభావాలు, సమాజం గురించే కాదు, లైంగిక జీవితాన్నీ దాచుకోకుండా పుస్తకాల ద్వారా చెప్పింది. వాటన్నిటినీ ఉన్నది ఉన్నట్లు, అందరికీ అర్థమయ్యే భాషలో రాసిన విధానం మెప్పిస్తుంది. అందుకే ఆమె పుస్తకాల్ని ఆత్మకథలు(ఆటోబయోగ్రఫీ)గా చెప్తారు. వాటిలో ‘క్లీన్డ్​ ఔట్’ నవల.. యానీ మొదటి లైంగిక జీవితం, అబార్షన్​ గురించి చెప్తుంది. ఇది ఆధునిక రచనల్లో వచ్చిన మొదటి ఆటోబయోగ్రఫీ అంటారు. ఇదే నవలలోని అంశాల్ని మరింత విడమర్చి చెప్తూ ఆమె రాసిన ‘హ్యాపెనింగ్​’ నవల 2000లో విడుదలైనప్పుడు ప్రపంచ సాహిత్యంలో వచ్చిన సంచలనం అంతా ఇంతా కాదు. యానీ యుక్తవయసులోకి అడుగుపెడుతున్నప్పడు ఆమె కన్న కలలు, వాటికి సమాజ, కుటుంబ కట్టుబాట్లు తెచ్చిన అడ్డంకులను ‘ఎ ఫ్రోజన్​ ఉమన్​’ చెప్తుంది. ​పేదరికానికి ప్రతిరూపమైన ‘వర్కింగ్​ క్లాస్​’ నుంచి ధనవంతురాలిగా మారడంలో యానీ ఎదుర్కొన్న వివక్ష, ఇబ్బందుల గురించి ‘ఎ మ్యాన్స్​ ప్లేస్​’లో తెలుసుకోవచ్చు. 20వ శతాబ్దం రెండో భాగంలో యానీకి ఎదురైన అనుభవాలే ‘ది ఇయర్స్​’ పుస్తకం. ఇందులో యుద్ధాలు, లైంగిక స్వేచ్ఛ, పాప్​ కల్చర్​ వంటివి ఎలా ఉంటాయో రాసిందామె. ‘ఎ గర్ల్స్​ స్టోరీ’ కూడా ఆమె సొంత అనుభవాలే.   

నిజాల్ని నిర్భయంగా రాయడం వల్లే యానీని ‘ట్రూత్​ టెల్లర్​ ఆఫ్​ ఫ్రాన్స్’ అంటారు. ​అలాంటి రచనలే ఆమెకు 2022 సంవత్సరానికి సాహిత్యంలో అత్యున్నతమైన నోబెల్​ పురస్కారం తెచ్చిపెట్టాయి. యానీ ఫ్రెంచ్​ భాషలోనే రచనలు చేసేది. అవి ఇంగ్లీష్​లోకి అనువాదమయ్యాయి. ఇప్పటివరకు సాహిత్యంలో 119 మంది ‘నోబెల్​’ అవార్డు తీసుకోగా, వాళ్లలో 16 మంది మహిళలు.  ఇప్పుడు ఆ జాబితాలో చేరిన17వ మహిళ యానీ.