ఆ ఊళ్లోకి ఏ వాహనానికి పర్మిషన్​ లేదు

ఆ ఊళ్లోకి ఏ వాహనానికి  పర్మిషన్​ లేదు

ఊరంటే కొన్ని ఇళ్లు, బళ్లు, గుళ్లు... ఉంటాయి. ఈ ఊళ్లోనూ అవి ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగడానికి మాత్రం కారు లేదు. బస్​ లేదు. ట్రైన్​ లేదు.  బైక్ కూడా లేదు. ఆ మాటకొస్తే... రోడ్డే లేదు. మరెలా? అంటే... ఊరంతా నీళ్లే ఉంటాయి. అందుకని వాళ్లంతా బోట్లలో తిరుగుతుంటారు. ఒక సినిమా పాటలో ‘ఊరు ఏరైంది’ అంటాడు రచయిత. ఈ ఊరిని చూస్తే మాత్రం ఏరులోనే ఊరు కట్టారేమో అనిపిస్తుంది. మరి ఈ ఊరు ఎక్కడుందో, ఎలా ఏర్పడిందో అనే డౌట్స్​ క్లియర్ అవ్వాలంటే ఈ టూర్ వేయాల్సిందే!

చెక్క ఇళ్లు, రంగుల పూల చెట్లు, విశాలమైన గార్డెన్​లు, ప్రశాంత వాతావరణం, పాతకాలపు ఆర్కిటెక్చర్​తో ఈ ఊరిని చూసేందుకు రెండు కళ్లూ చాలవు​. నెదర్లాండ్​లోని ఒవెరిస్సెల్​ ప్రావిన్స్​లో ఉన్న ఊరు ‘గీథూర్​​’లో ఆశ్చర్యపరిచే విశేషాలున్నాయి. మామూలుగా అయితే ఏదైనా కొత్త ఊరికి వెళ్లాలంటే బస్​లో వద్దు, ట్రైన్ బాగుంటుంది. ట్రైన్​ జర్నీ కంటే కార్ జర్నీ కంఫర్ట్ అంటుంటారు. అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్లు ప్లాన్ చేసుకుని టూర్​లు వేస్తుంటారు. కానీ, ఈ ఊరికి వెళ్లడానికి అలా కుదరదు. బస్​, కార్​, ట్రైనే కాదు, చివరికి బైక్​కి కూడా  పర్మిషన్​ లేదు.

‘రూల్స్​ బ్రేక్​ చేసైనా వెళ్తా.. కావాలంటే ఫైన్​ కట్టచ్చులే. కార్​, బైక్​ల్లో వెళ్తేనేగా ఫీల్ బాగుండేది..’ అంటారా! అస్సలు కుదరదు. ఎందుకంటే... అవన్నీ నడపాలంటే ముందు రోడ్‌‌ ఉండాలి కదా. ఆ ఊళ్లో రోడ్ ఉండదు. సిమెంట్, తారు రోడ్లే కాదు, కనీసం మట్టి రోడ్లు కూడా కనిపించవు. ఎందుకంటే, అక్కడ అన్నీ కాలువలు ఉంటాయి. ఊరు శివారు వరకు కార్​లో రావొచ్చు. తర్వాత ఆ కార్లను ఊరి బయటే పార్క్​ చేయాలి. బయట పెడితే దొంగిలిస్తారేమో!లక్షలు పెట్టి కొన్న కారు పోతుందేమో అనే భయం అక్కర్లేదు. ఎందుకంటే ఈ ఊరి వాళ్లకూ కార్లు ఉన్నాయి. అవి కూడా ఊరిబయటే ఉంటాయి. ఇంతకు ముందు ఈ ప్రాంతంలో పెడస్ట్రియన్ జోన్​( కాలినడక)గా ఉండేది. కాలక్రమేణా వంతెనలు కట్టారు. అందుకని అక్కడ బోటింగ్​తోపాటు నడక, సైక్లింగ్ మాత్రమే చేయగలరు. కావాలంటే టూరిస్ట్​లు సైకిల్ రెంట్​కి తీసుకుని తిరిగి రావొచ్చు. రెంట్​ కూడా తక్కువే. సౌండ్, ఎయిర్ పొల్యూషన్​ జాడే కనిపించదు. చెత్త ఎక్కడంటే అక్కడ పారేయకూడదు. అందుకోసం చాలా చోట్ల గార్బేజ్​ బిన్స్​ ఏర్పాటు చేసి ఉంటాయి. వాటిలోనే చెత్త వేయాలి. ఫ్రెంచ్ ఫ్రైస్​, డచ్ చీజ్​, హెర్రింగ్, స్ట్రూప్​ వేఫెల్స్​ వంటి ఫుడ్స్​ ఇక్కడ ఫేమస్. ఆగస్ట్​లో చివరి శనివారం ఫెయిరీటేల్ ఈవెంట్ జరుగుతుంది. దానిపేరు ‘గోండల్ వార్ట్​’ (గోండల్ టూర్). ఆ సందర్భంగా కెనాల్​లో బోట్ పరేడ్ చేస్తారు. సమ్మర్ ఫెయిర్​లు కూడా జరుగుతాయి.

అసలు కంటే కొసరే ఎక్కువ
గీథూర్​కి అసలుపేరు కంటే కొసరు పేర్లే ఎక్కువ. దీన్ని వెనిస్​ ఆఫ్ నెదర్లాండ్స్​, డచ్ వెనిస్, వెనిస్ ఆఫ్ హోలాండ్, లిటిల్ వెనిస్, వెనిస్​ ఆఫ్ నార్త్ అనే పేర్లతో పిలుస్తారు. స్థానికంగా వాళ్లు ‘గెటెన్​హార్న్’ అని పిలిచేవాళ్లు. ‘హార్న్​ ఆఫ్ గోట్స్’ అని దానర్థం. అదే కాలక్రమంలో గీథూర్​గా మారింది. 

ఎలా ఏర్పడిందంటే...
ఈ ఊరు వెనక రెండు స్టోరీలు ఉన్నాయి. ఒకటి...13వ శతాబ్దంలో ఫ్రాన్సిస్కన్​ సన్యాసులు ఇక్కడికి రావడం గురించి. ట్రాన్స్​పోర్ట్ ఫ్యూయల్​ తయారుచేయడం కోసం వాళ్లు కుళ్లిన చెట్ల చెత్త (పిట్)ను తీసుకెళ్లేవాళ్లు. వాటికోసం ఈ ప్రాంతంలో ఎక్కడిపడితే అక్కడ  కాలువలు తవ్వారు. పిట్ కోసం కాలువలు తవ్వేసరికి అక్కడ నేల తక్కువై చిన్న, పెద్ద సరస్సులు ఏర్పడ్డాయి. ఉన్న నేలలోనే వాళ్లంతా ఇళ్లు కట్టుకున్నారు. 
మరొకటి... 1170లో పెద్ద వరద వచ్చింది. అప్పుడు ఆ విపత్తు నుంచి తప్పించుకున్న ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చారు.1230లో మధ్యదరా నుంచి వచ్చిన కొంతమంది ఇక్కడ ఊరు కట్టారు.  వాళ్లు ఇక్కడ అడవి మేకల కొమ్ములు గుర్తించారు. అవి కూడా వరదలో చిక్కుకుని చనిపోయి ఉంటాయనేది వాళ్ల అంచనా. అప్పటి నుంచి వాళ్లే అక్కడ ఉండిపోయారని కూడా అంటారు.

ఊరి విశేషాలు
ఈ ఊరంతా చిన్న చిన్న ఐలాండ్​లతో ఉంటుంది. అటు నుంచి ఇటు ఇళ్లలోకి వెళ్లడానికి వంతెనలు ఉంటాయి. అవి ఒకటో రెండో కాదు, ఏకంగా180 చెక్క వంతెనలు. రోజుకి దాదాపు 600 బోట్లు తిరుగుతాయి. కాలువ ఏడు కిలో మీటర్లు ఉంటుంది. కానీ లోతు రెండు మూడు అడుగులే. బాతుల క్వాక్ క్వాక్​ సౌండ్ మాత్రమే కాస్త గట్టిగా వినిపిస్తుంది ఇక్కడ. ఊరంతా  ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ ఊళ్లో మొత్తం1,100 ఇళ్లున్నాయి. అందులో 2,500 పైగా జనాభా ఉన్నారు. అక్కడి వాళ్లకు మర్యాద ఇవ్వాలి. వాళ్లు వంతెనలు మూసేసినప్పుడు అటు వైపు వెళ్లకూడదు. బోట్​లో నుంచి దిగి వాళ్ల ఇంటి గార్డెన్స్​లోకి వెళ్లకూడదు. ఇక్కడ ఉండే వాళ్లకంటే టూరిస్ట్​ల సంఖ్యే ఎక్కువ. సంవత్సరానికి రెండు లక్షల మందిదాకా టూరిస్ట్​లు ఇక్కడికి వెళ్తుంటారు. తినుబండారాలు అమ్మేవాళ్లు కూడా బోట్లలో తిరుగుతూ టూరిస్ట్​లకు అమ్ముతుంటారు. అప్పుడప్పుడు రోడ్ల మీద ట్రాఫిక్ లాగే ఇక్కడ బోట్ ప్రాబ్లమ్​ వస్తుంటాయి.

సమ్​థింగ్ స్పెషల్​
మ్యూజియం, ప్రైమరీ స్కూల్, చర్చ్​లు కూడా ఉన్నాయి అక్కడ. ‘హెట్ ఓల్డె మాత్ యుఅజ్’ అనే మ్యూజియం ఉంది. అది శతాబ్దాల నాటి ఫార్మ్​ హౌస్​లా ఉంటుంది. ఇక్కడ ఆర్ట్ ఎగ్జిబిషన్స్​ కూడా బోలెడు ఉంటాయి. పిల్లలకోసం స్పెషల్ యాక్టివిటీస్ ఉంటాయి. రాళ్ల గురించి స్టడీ చేసేవాళ్లకు ఇది అనువైన ప్లేస్​. ఇక్కడ చారిత్రక కట్టడాలు, భవంతులు చాలా బాగుంటాయి. వాటిలోకి వెళ్తే బోలెడన్ని సంగతులు తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ కెనాల్స్​లో తిరగడానికి అద్దెకు ఎలక్ట్రిక్ విస్పర్ బోట్ దొరుకుతుంది. గంటకు 30 యూరోలు చార్జ్​ చేస్తారు. ఇవేకాకుండా టూర్ బోట్​లు కూడా ఉంటాయి. ఎక్కువమంది టూరిస్ట్​లు వచ్చినప్పుడు, టూర్​బోట్​లలో వెళ్లొచ్చు. బోటింగ్​తోపాటు సైక్లింగ్, సెయిలింగ్ స్పెషల్ అట్రాక్షన్స్​.  

సమ్మర్​ బెటర్
సీజన్​ టైంలో అయితే బోట్​లు ఫ్రీగా దొరకవు. కాబట్టి ఒక రోజు ముందుగానే రెంట్​కి తీసుకోవాలి. కాలువల ఒడ్డున హోటల్స్​, హాలిడే గెస్ట్​ హౌస్​లు ఉంటాయి. కాబట్టి బస చేయడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చలికాలంలో సరస్సు గడ్డకట్టిపోతుంది. ఆ టైంలో ఐస్​ స్కేటింగ్ చేసేందుకు టూరిస్ట్​లు వస్తుంటారు. చలిని తట్టుకోగలిగేతే వింటర్​లో వెళ్లొచ్చు. లేదంటే సమ్మర్​లో వెళ్లడమే బెటర్.

ఎలా వెళ్లాలి?
కార్ లేదా బస్​​లో ఆమ్​స్టర్​డామ్​ నుంచి గంటన్నర ప్రయాణం. స్టీన్ విక్జ్​ నుంచైతే గీథూర్​​ చేరుకోవడానికి ఐదు కిలోమీటర్ల దూరం జర్నీ చేయాలి. మనం వెళ్లాలంటే... హైద్రాబాద్​ నుంచి ఆమ్​స్టర్​డామ్​ విమానంలో వెళ్లి, అక్కడి నుంచి ట్రైన్​లో వెళ్లాలి. దీనికి 30 వేల నుంచి 46 వేల వరకు ఖర్చు అవుతుంది. అలాగే హైద్రాబాద్​ నుంచి బ్రస్సల్స్​, డస్సెల్​డోల్ఫ్, ఫ్రాంక్​ఫర్ట్, మ్యూన్​స్టర్​లకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి ట్రైన్​లలో వెళ్లొచ్చు. అలా వెళ్తే 28 వేల నుంచి 78 వేల వరకు ఖర్చు అవుతుంది.