
- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : కాలభైరవస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. గురువారం యాదగిరిగుట్ట మండలం సైదాపురం శివారులోని బోధానంద ఆశ్రమంలో ఉన్న కాలభైరవస్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తిభావంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ దేవుడి పట్ల ఆరాధన, చింతన అలవర్చుకోవాలని సూచించారు.
ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మార్గం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇటీవల యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులు దేవుడి పట్ల భక్తిభావం పెంపొందించుకుంటే..
చెడు అలవాట్లుకు దూరమవుతారని తెలిపారు. ఆయన వెంట కాలభైరవ శక్తిపీఠం పీఠాధిపతి బోధానందస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆంజనేయులు, టౌన్ అధ్యక్షుడు భిక్షపతి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సుధ, వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, నాయకులు ఉన్నారు.