ఓటీటీల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాడ్స్ పై కేంద్రం నిఘా..

ఓటీటీల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాడ్స్ పై కేంద్రం నిఘా..

సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ వచ్చిన తర్వాత యాప్ లో వచ్చే ప్రకటనలతో చాలా మంది మోసాలకు గురవుతున్నారు. కొన్ని ఫేక్ అడ్వర్టైజ్ మెంట్స్ తో యూజర్స్ ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరికొన్ని 18ప్లస్ కంటెంట్ ను ఫ్రీగా అందిస్తూ చిన్నారుల మనసును పాడు చేస్తున్నాయి. ఈ పరిణామాలపై తాజాగా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యలతో పాటు భద్రతా సమస్యల కారణంగా భారీ విమర్శలను ఎదుర్కొంటున్న ఈ ప్రకటనలపై తీవ్రంగా స్పందించింది. బహుళ ఏజెన్సీలు, మంత్రిత్వ శాఖలతో ఇటీవల జరిగిన సమావేశంలో ప్రకటనలపై కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

అన్ వాంటెడ్, అసభ్యకరమైన ప్రకటనలను చూపించవద్దనిని భారత ప్రభుత్వం ఇప్పటికే టీవీ ఛానెల్‌లు, OTT ప్లాట్‌ఫారమ్‌లను కోరింది. అయితే వీటిపై ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కొన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు మాత్రం వాటిని ప్రసారం చేస్తున్నాయని సమావేశానికి హాజరైన ఓ సీనియర్ అధికారి తెలిపారు. గత సంవత్సరం, ప్రభుత్వం అన్ని శాటిలైట్ టీవీ, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ సేవలను ప్రకటనలు లేదా జూదం, బెట్టింగ్‌ల ప్రచార వీడియోలను ప్రసారం చేయవద్దని కోరింది. లేదంటే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. కానీ కొన్ని ప్రకటనల కోసం టాప్-రేట్ లేని కొన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నట్లు తేలింది. వాటిలో కొన్ని 18+ కంటెంట్‌ను మాత్రమే చూపుతాయి.

సోషల్ మీడియా సైట్లు, యాప్‌లలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఖాతాల ద్వారా కూడా నకిలీ కంపెనీలు ప్రకటనలను ప్రోత్సహిస్తున్నాయి. వివిధ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు.. ప్రత్యేకంగా మిడ్, మైక్రో, నానో టైర్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు - తమ వీడియోలలో ఈ ఆఫ్‌షోర్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కంపెనీలు చేస్తున్న అవకతవకలపై గత కొన్ని నెలలుగా ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018 నుండి, MHA.. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్/బెట్టింగ్ విభాగానికి 8వేల కంటే ఎక్కువ ఫిర్యాదులను అందుకుంది.

కొన్ని ప్లాట్‌ఫారమ్‌లు ప్లేయర్ వెరిఫికేషన్ ముసుగులో ఆటగాళ్ల బ్యాంక్ ఖాతా నంబర్లు, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ వంటి ఇతర సున్నితమైన వివరాలను డిమాండ్ చేస్తున్నాయని, తద్వారా వ్యక్తిగతానికి ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వ ఏజెన్సీలు తెలిపాయి. హవాలా, క్రిప్టోకరెన్సీలు లేదా ఇతర బ్లాక్ మార్కెట్ లావాదేవీల ద్వారా భారతదేశం ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లడం ద్వారా భారతదేశం నుంచి అధిక ఆదాయాన్ని పొందుతున్నట్లు అనుమానిస్తున్నారు. పబ్లిక్ ఆర్డర్, జాతీయ భద్రతకు ఆటంకం కలిగించే ఇతర చట్టవిరుద్ధమైన, నేర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చని అధికారులు చెబుతున్నారు.