గౌతమ బుద్ధుడి బోధనలు ప్రపంచానికి ఆదర్శం : మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి

గౌతమ బుద్ధుడి బోధనలు ప్రపంచానికి ఆదర్శం : మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి

హాలియా, వెలుగు : గౌతమ బుద్ధుడి బోధనలు ప్రపంచానికి ఆదర్శమని మాజీ సీఎల్పీ లీడర్​ కుందూరు జానారెడ్డి అన్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా గురువారం నాగార్జునసాగర్ బుద్ధవనంలో ధర్మ చక్ర ప్రవర్తన దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా బుద్ధవనంలోని బుద్ధపాదాల వద్ద ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రముఖ బాలీవుడ్ నటుడు గగన్ మాలిక్, వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ రవి బంకర్ తో కలిసి ఆయన పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఐపీఎస్ అధికారి చారుసిన్హా బహూకరించిన బుద్ధగయ నుంచి తెచ్చిన బోధి మొక్కను బుద్ధ వనంలోని ధ్యానవనంలో నాటారు. 

మహాస్తూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతిని వెలిగించి బౌద్ధ సాంప్రదాయ ప్రార్థన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జానారెడ్డి మాట్లాడుతూ బుద్ధవనాన్ని నాగార్జునసాగర్ లో ఏర్పాటు చేయడానికి నాడు ఎంతో కృషి చేశామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బుద్ధవనం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, ఆర్ట్  ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్రావు, అధికారులు, బౌద్ధవానులు పాల్గొన్నారు.