దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

ధర్మసాగర్, వెలుగు: భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలకు పరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు త్వరగా నమోదు చేసి నివేదికను అందజేయాలని, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారం గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు, రోడ్లను పరిశీలించారు. 

వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ లో దెబ్బతిన్న పంటల వివరాల నమోదు చేస్తున్న సమాచారాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్ కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్​ మాట్లాడుతూ పంట నష్టం అంచనా వివరాలను త్వరగా అందజేయాలన్నారు. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్ ను పరిశీలించి,  ఇన్ ఫ్లో, అవుట్​ఫ్లో వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ ఆత్మారామ్, డీఈ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ మంగీలాల్, ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.