
- ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి
హనుమకొండ, వెలుగు: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని ఉమ్మడి జిల్లా స్పెషల్ఆఫీసర్, స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలపై గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్, డీఎంహెచ్ వో అప్పయ్య, ఇతర ఆఫీసర్లతో రివ్యూ చేశారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో పంచాయతీ కార్యదర్శులను భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాలు, వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ బాగుండాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు.
డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వచ్చిన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలని చెప్పారు. హెచ్ఐవీ నియంత్రణకు కృషి చేయాలని, అనుమానిత లక్షణాలున్నవారికి వైద్య పరీక్షలు చేయించాలన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్మాట్లాడుతూ.. ఆశావర్కర్లు, ఏఎన్ఎంలతో గ్రామాల్లో ఫీవర్ టెస్టులు చేయిస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్వో అప్పయ్య మాట్లాడుతూ.. జనవరి నుంచి ఇప్పటివరకు ఒక మలేరియా కేసు, 48 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అన్ని జీపీల్లో వాటర్ ట్యాంకులనుశుభ్రం చేయించామని, దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు డీపీవో లక్ష్మీ రమాకాంత్ తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో మదన్ మోహన్ రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌతమ్ చౌహాన్, వివిధ ఆస్పత్రుల వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు.