మంగళవారం ఏప్రిల్​ 23 ఆంజనేయుడికి ఇష్టమైన రోజు... ఆ రోజే హనుమత్​ జయంతి

మంగళవారం ఏప్రిల్​ 23 ఆంజనేయుడికి ఇష్టమైన రోజు... ఆ రోజే హనుమత్​ జయంతి

మంగళవారం హనుమాన్ జయంతి అత్యంత పవిత్రం.. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఆంజనేయుడికి ఇష్టమైన మంగళవారం రోజు వచ్చింది. ఏప్రిల్ 23వ తేదీ హనుమాన్ జయంతి జరుపుకోనున్నారు. హనుమంతుడి పుట్టుక వెనుక ఉన్న ఈ ఆసక్తికర విషయాలతో పాటు ఆంజనేయుడి జన్మవృత్తాంతం గురించి తెలుసుకుందాం. . 

 దృక్‌ సిద్దాంత పంచాంగ గణితం ఆధారంగా చైత్ర మాస శుక్లపక్ష పౌర్ణమి తిథి మంగళవారం ఏప్రిల్ 23వ తేదీ వచ్చిందని ఈ రోజే హనుమాన్ జయంతి అని.. ఆంజనేయస్వామి జన్మదినోత్సవం అని .. పురాణాల ద్వారా తెలుస్తోంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం హనుమంతుడు పుట్టిన వారం మంగళవారం అని ఆ మంగళవారంతో కూడి చైత్ర పౌర్ణమి అరుదుగా రావడం విశేషం. 2024 ఇవి రెండూ కలిసి రావడం వలన ఈ హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకమైనదని పండితులు చెబుతున్నారు. 

భారతదేశంలో హనుమన్ జయంతికి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమి రోజునే హనుమాన్ జయంతిని జరుపుకుంటారని, దక్షిణ భారతదేశంలో కర్ణాటక వంటి ప్రాంతాలలో వైశాఖ త్రయోదశి రోజు లేదా పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. తమిళనాడు, కేరళ ప్రజలందరూ ధనుర్మాసంలో హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.

భారతదేశంలో చాలా ప్రాంతాలలో చైత్ర పౌర్ణమి రోజే హనుమాన్ జయంతి ( ఏప్రిల్​ 23, 2024) ని జరుపుకుంటారు,  మంగళవారం లేదా శనివారంతో కూడియున్న రోజులలో హనుమాన్ జయంతి రావటం అత్యంత పవిత్రదినంగా భావిస్తారు. ఈ ఏడాది (2024) మంగళవారం వచ్చింది. ఆంజనేయస్వామిని కొలిచే భక్తులు చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ పౌర్ణమి వరకు హనుమత్‌ దీక్షలు ప్రత్యేకంగా నెలరోజులు ఆచరిస్తారు. 

హనుమంతుడి పుట్టుక కథలు

హనుమంతుడు కేసరి, అంజనలకు జన్మించాడని చిలకమర్తి తెలిపారు. హనుమంతుడు వాయుదేవుని ఖగోళ కుమారుడు అని కూడా చెప్తారు. హనుమంతుని తల్లి అంజనాదేవి. ఆమె అప్సరస. శాపము కారణముగా వానరరూపం ధరించి సంతానం కలగడంతో శాప విముక్తి పొందినది. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుని తండ్రి కేసరి కిష్కింధ రాజ్యానికి సమీపంలో సుమేరుని ప్రాంతానికి రాజు. కేసరి బృహస్పతి కుమారుడు.


చాలాకాలం కేసరి, అంజనాదేవిలకు సంతానం కలుగలేదు. అంజనాదేవికి పుష్కర కాలం శివుని కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై రుద్రుని అంశతో కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. రామాయణం ప్రకారం దశరథ మహారాజు పుత్రకామేష్టి యోగం చేసి ఆ యాగములో వచ్చిన పాయసమును పంచుతుండగా ఒక పక్షి ఆ పాయసం కొంత భాగాన్ని లాక్కొని వెళ్ళిందట. ఆ భాగం అంజనాదేవి పూజలో నిమగ్నమై ఉన్న అడవిపై ఎగురుతున్నప్పుడు ఆ పాయస భాగాన్ని జారవిడించిదని, ఆ జారబడుతున్న పాయసాన్ని వాయువు అంజనాదేవికి అందించాడట. అలా వాయువు ద్వారా అందుకున్న పాయసాన్ని స్వీకరించిన అంజనాదేవి హనుమంతుని కుమారునిగా పొందెనని  బ్రహ్మాండ పురాణంలో తెలిపారు.

Also Read :  రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే.

హనుమాన్ జయంతి రోజు కేసరి, అంజనాదేవి, వాయుదేవులు, హనుమంతుని స్మరించుకొని ఆంజనేయస్వామిని పూజించినటువంటి వారికి బాధలు తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయస్వామిని పూజించడం చేత శని బాధలు, కుజ దోషాలు వంటివి తొలుగుతాయి. ఈరోజు ( ఏప్రిల్​ 23)  హనుమ ఆలయాలను దర్శించడం, రామనామ స్మరణ చేయడం, రామాయణం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది.  అవకాశం ఉన్నవారు ఈరోజు హనుమత్‌ వృతాన్ని కనుక ఆచరించినట్లయితే ఆంజనేయస్వామిని షోడశోపచారాలతో పూజించినట్లయితే ఆయన కటాక్షం లభిస్తుంది. సాయంత్రం హనుమంతుల వారిని పూజించడం వలన చాలా విశేషమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.