
- హెయిర్ ఎక్స్‌పోర్టింగ్‌లో బెట్టింగ్ అమౌంట్
- రూ.16 కోట్ల హవాలా మనీ గుర్తింపు
- ఈడీ దర్యాప్తులో బయటపడ్డ లింక్స్
తల వెంట్రుకల స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో చైనా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ దందా బయటపడింది. వెంట్రుకల ఎక్స్‌పోర్ట్‌లో అండర్ ఇన్‌వాయిస్ కింద స్మగ్లింగ్ జరుగుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వెంట్రుకల స్మగ్లింగ్ తీగ లాగుతున్న ఈడీకి చైనా బెట్టింగ్ యాప్స్ లింక్ దొరికింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇండియాలో జరుగుతున్న హవాలా గుట్టు బయటపడింది. ఇందులో భాగంగానే మంగళవారం హైదరాబాద్‌తో పాటు ఈస్ట్ గోదావరి, గుంటూరులోని తొమ్మిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిపింది. వికాస్ ఎంటర్‌ప్రైజెస్, నరేష్ హెయిర్ ఎక్స్‌పోర్టర్, హృతిక్ ఎగ్జిమ్ సహా మరో ఆరు కంపెనీలపై దాడులు చేసింది. హెయిర్ ఎక్స్‌పోర్ట్ వ్యాపారి నుంచి రూ.2.90 కోట్ల క్యాష్,12 మొబైల్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు,కంప్యూటర్, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో మనీలాండరింగ్, హవాలా జరిగినట్టు ఆధారాలు సేకరించింది. ఇండియాలో కొంటున్న వెంట్రుకలకు తక్కువ విలువ చూపుతూ విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. చైనీస్ ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు రూ.16 కోట్ల వరకు హవాలా లావాదేవీలను గుర్తించారు. హైదరాబాద్, గౌహతి, కోల్‌కతాల్లోని కొందరికి తల వెంట్రుకల హవాలా రూపంలో డబ్బు వెళ్లింది. భారత్‌లో సేకరించిన వెంట్రుకలను రోడ్డు మార్గంలో మణిపూర్,మిజోరామ్ కి చేరవేస్తున్నారు. అక్కడి నుంచి మయన్మార్ మీదుగా చైనాకు తరలిస్తున్నారు.
కలర్ ప్రిడిక్షన్ బెట్టింగ్ యాప్
ఈ మొత్తం వ్యవహారంలో 36శాతం ట్యాక్సులు ఎగవేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా సేకరించిన వెంట్రుకలను అండర్ వాల్యూ కింద చూపి హవాలా రూపంలో చెల్లింపులు జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించింది. సిటీలోని ఇద్దరు వ్యాపారులకు రూ.3 కోట్ల 38 లక్షలను చైనాకు చెందిన ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ లింక్యున్, డోకీపే టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్‌తో హవాలా పేమెంట్స్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే చైనా కలర్ ప్రిడిక్షన్ ఆన్‌లైన్ గేమ్ యాప్స్‌పై హైదరాబాద్,సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్‌లో కేసులు నమోదు అయ్యాయి. చైనాకు చెందిన ల్యాంబోతో పాటు నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.