స్థానిక ఎన్నికలపై భగ్గుమన్న బీసీ సంఘాలు

స్థానిక ఎన్నికలపై భగ్గుమన్న బీసీ సంఘాలు
  • రిజర్వేషన్లు తేలకుండా ఎలా నిర్వహిస్తారని మండిపాటు
  • పలుచోట్ల కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం

హైదరాబాద్​సిటీ/ బషీర్​బాగ్​/ ఓయూ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తేలకుండానే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు వెళ్తుండడంపై బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. 23 శాతం రిజర్వేషన్​తో ఎలక్షన్లు నిర్వహించడం తగదని నాయకులు అన్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 46ను వ్యతిరేకిస్తూ నారాయణగూడలోని వైఎంసీఏ చౌరస్తాలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో, ఓయూ ఆర్ట్స్​ కాలేజీ వద్ద బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. 

బీసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ క్రిష్ణ, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వామి గౌడ్​ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందంతోనే ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆరోపించారు. గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లును ఆమోదించేలా చొరవ తీసుకోవాలని, లేదంటే పార్లమెంట్ లో 9వ షెడ్యూల్​లో చేర్చి 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 బీసీ జనసభ అధ్యక్షుడు డి.రాజరాంయాదవ్  ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం గన్ పార్క్ వద్ద ధర్నా  నిర్వహించారు. 

ఇందులో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సినీ డైరెక్టర్ ఎన్ శంకర్, బీసీ సంఘం నేత ఓరుగంటి వెంకటేశ్ గౌడ్  పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకు రాజకీయ, ప్రజా సంఘాలు, మేధావులతో ఈ నెల 28న రౌండ్​ టేబుల్​ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ బహుజన కూటమి అధ్యక్షుడు గాలి ఉదయ్​కుమార్​ తెలిపారు. 

మోకాళ్లపై నిలబడి నిరసన..

ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చోని నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ కొమ్మనబోయిన సైదులు యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్​ను చట్టబద్ధత చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు.