ఆన్లైన్లో వాటర్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్ : ఎండీ అశోక్ రెడ్డి

ఆన్లైన్లో వాటర్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్ : ఎండీ అశోక్ రెడ్డి
  • సేవలను ప్రారంభించిన వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త భవన నిర్మాణాలకు వాటర్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్​ను తప్పనిసరిగా జీహెచ్‌ఎంసీకి సమర్పించాలి. గతంలో డివిజన్ స్థాయిలో జనరల్ మేనేజర్లు ఈ సర్టిఫికెట్‌లను జారీ చేసేవారు. కానీ ఇప్పుడు ప్రధాన కార్యాలయం ద్వారా సర్కిల్ సీజీఎంలు జారీ చేస్తున్నారు. తాజాగా, మెట్రో వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి ఆన్​లైన్ వాటర్ ఫీజిబిలిటీ సేవలను శనివారం ప్రారంభించారు. ఇకపై ఆన్​లైన్ దరఖాస్తుల ద్వారా వాటర్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్‌లు జారీ చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ అనుమతి కోసం భవన యజమానులు విద్యుత్ ఫీజిబిలిటీతో పాటు ఈ సర్టిఫికెట్‌ను సమర్పించాలి.

దరఖాస్తు, జారీ ఇలా.. 

హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ వెబ్​సైట్ ద్వారా వాటర్ ఫీజిబిలిటీ సర్టిఫికెట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించగానే ఫైల్ నంబర్ జారీ అవుతుంది. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేసి, రూ.5,000 ప్రాసెసింగ్ ఫీజును ఆన్​లైన్ లేదా నగదు ద్వారా చెల్లించాలి. ఫైల్ సీజీఎంకి పంపబడి, వివరాలు మొబైల్ యాప్, చెక్​లిస్ట్​లో అప్​డేట్ అవుతాయి. సీజీఎం ఫీజిబిలిటీ పూర్తి చేసి, అవసరమైతే సిఫార్సులతో ఫైల్​ను అవుట్‌వార్డ్ చేస్తారు. 

ఈడీ, రెవెన్యూ డైరెక్టర్, సీజీఎం (రెవిన్యూ)ల కమిటీ వారానికొకసారి సమీక్షించి ఆమోదిస్తుంది. ఆమోదం తర్వాత సీజీఎం (రెవిన్యూ) చార్జీల అంచనా తయారు చేసి, ఎస్‌ఎంఎస్ ద్వారా దరఖాస్తుదారునికి పంపుతారు. 30 రోజుల్లో చార్జీలు చెల్లించాలి. చెల్లింపు అనంతరం సీజీఎం (రెవిన్యూ) డిజిటల్ సంతకంతో సర్టిఫికెట్ జారీ చేస్తారు.