
హైదరాబాద్: డబ్బులు విత్ డ్రా చేసుకున్నట్టే ఇప్పుడు బంగారాన్ని కూడా ఏటీఎం నుంచి తీసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా గోల్డ్ ఏటీఎంను బేగంపేట్ లోని సిక్కా స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సపోర్ట్ తో దేశంలోనే మొదటి గోల్డ్ ఏటీఎంను హైదరాబాదులో ప్రారంభించింది. లాంచ్ చేసిన వెంటనే 50 గ్రాముల బంగారం కొనుగోలు జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
డబ్బులు డ్రా చేసినంత సులువుగా బంగారం కొనుగోలు
ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినంత సులభంగా గోల్డ్ ఏటీఎం మిషన్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. డెబిట్ కార్డుతపాటు క్రెడిట్ కార్డుతో కూడా గోల్డ్ కొనుగోలు చేసే సదుపాయం ఉంది. బంగారంలో స్వచ్ఛతతోపాటు నిమిషాల వ్యవధిలోనే బంగారు కొనుగోలు చేసే సదుపాయం ఉండడంతో నగర వాసులు ఆసక్తి చూపుతున్నారు. సాధారణ ఏటీఎంల మాదిరిగానే ట్రాన్జాక్షన్ జరిగిన తర్వాత బంగారం కాయిన్ రాకపోతే 24 గంటల్లో డబ్బు రీఫండ్ చేస్తారు.. ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకునేందుకు కస్టమర్ కేర్ సదుపాయం కూడా ఉండడంతో గోల్డ్ ఏటీఎం అందర్నీ ఆకట్టుకుంటోంది.