10 వికెట్ల తేడాతో కోహ్లీసేన ఓటమి

10 వికెట్ల తేడాతో కోహ్లీసేన ఓటమి
  • పాకిస్తాన్‌‌పై భారత్ విజయ యాత్రకు బ్రేక్‌
  • చెలరేగిన షాహీన్​ ఆఫ్రిది
  • రిజ్వాన్‌‌, బాబర్‌‌ హాఫ్‌‌ సెంచరీలు

టీ20 ఇంటర్నేషనల్స్‌‌లో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇండియాకు ఫస్ట్‌‌ టైమ్‌‌కాగా, 10 వికెట్లతో గెలవడం పాక్‌‌కు కూడా తొలిసారే.
పాకిస్తాన్‌‌పై టీమిండియా విజయయాత్రకు బ్రేక్‌‌ పడింది. వన్డే, టీ20 వరల్డ్‌‌ కప్స్‌‌లో కలిపి పాక్​తో ఇప్పటిదాకా ఆడిన 12 మ్యాచ్‌‌ల్లో అపజయమే ఎరుగని మన జట్టుకు తొలి దెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌‌లో కోహ్లీసేన పది వికెట్ల తేడాతో పాక్‌‌ చేతిలో ఓడింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా టీ20 వరల్డ్‌‌కప్‌‌ను ఓటమితో ఆరంభించింది. కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ (57) పోరాటంతో తొలుత ఇండియా 151/7 స్కోరు చేసింది. తర్వాత బౌలర్లు చేతులెత్తేయడంతో పాక్‌‌  ఒక్క వికెట్‌‌ కూడా కోల్పోకుండానే ఇంకో 13 బాల్స్‌‌ మిగిలుండగానే టార్గెట్‌‌ ఛేజ్‌‌ చేసి గెలిచింది. 

ఎక్కడ జరిగినా.. ఎప్పుడు జరిగినా.. ఎలా జరిగినా... ఐసీసీ వరల్డ్‌‌కప్స్‌‌లో పాకిస్తాన్‌‌పై మనమే గెలుస్తాం.. ఇది చరిత్ర..! 1975 నుంచి మొదలుపెడితే 2016 వరకు 12 మ్యాచ్‌‌లు ఆడితే అన్ని విజయాలు మనవే.. ఇది రికార్డు..! కానీ ఈసారి హిస్టరీ రిపీట్‌‌ కాలేదు.. రికార్డు కొనసాగలేదు..! వరల్డ్‌‌ క్రికెట్‌‌ మొత్తం ఆతృతతో, ఆసక్తితో ఎదురుచూసిన అరుదైన పోరులో టీమిండియా అట్టర్‌‌ ఫ్లాప్‌‌ అయ్యింది..! ఎన్నడూ లేని విధంగా.. ఏనాడూ ఆడని రకంగా.. చరిత్రకు పూర్తి భిన్నంగా.. పాక్‌‌ బౌలర్ల ముందు.. టీమిండియా మొనగాళ్లు బ్యాట్లు ఎత్తేశారు..! ఇక బౌలర్లు కూడా పరుగుల గేట్లు తెరిచేయడంతో.. ఓ లో స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో అపురూప విజయాన్ని అందుకున్న పాకిస్తాన్‌‌ టీ20 వరల్డ్‌‌కప్‌‌లో బోణీ చేసింది..!!

దుబాయ్‌‌‌‌: ఐసీసీ మెగా టోర్నీల్లో పాకిస్తాన్‌‌‌‌ను చితక్కొట్టే టీమిండియా.. ఈసారి బొక్కబోర్లా పడింది. ఎలాగూ గెలుస్తామన్న అలసత్వమో, లేక అతి విశ్వాసమోగానీ, గతంలో ఎన్నడూ చూడని రీతిలో కోహ్లీసేన.. గ్రౌండ్‌‌‌‌లో దాయాది ముందు దూది పింజలా తేలిపోయింది. దాంతో టీ20 వరల్డ్​కప్​ను ఇండియా ఓటమితో మొదలుపెట్టింది. సూపర్​–12,  గ్రూప్​–2లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్​ చేతిలో ఓడింది. కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ (49 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 57), రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (30 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39) పోరాటంతో.. టాస్‌‌‌‌ ఓడిన ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 రన్స్‌‌‌‌ చేసింది. షాహీన్‌‌‌‌ ఆఫ్రిది (3/31) 3 వికెట్లతో టీమిండియా లైనప్‌‌‌‌ను కుదేల్​ చేశాడు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాకిస్తాన్‌‌‌‌ 17.5 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 152 రన్స్‌‌‌‌ చేసి నెగ్గింది. మహ్మద్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌ (55 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 నాటౌట్‌‌‌‌), బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (52 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 నాటౌట్‌‌‌‌) చెలరేగారు. ఆఫ్రిదికి ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 
ఓపెనర్లే కొట్టేసిన్రు..
భారీ టార్గెట్‌‌‌‌ కాకపోయినా, ఆరంభం నుంచే పాకిస్తాన్‌‌‌‌ ఓపెనర్లు మహ్మద్‌‌‌‌ రిజ్వాన్‌‌‌‌, బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ సమయోచితంగా ఆడారు. ఫస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో సెకండ్‌‌‌‌, థర్డ్‌‌‌‌ బాల్‌‌‌‌ను రిజ్వాన్‌‌‌‌ ఫోర్‌‌‌‌, సిక్సర్‌‌‌‌గా మలిస్తే, తర్వాతి ఓవర్‌‌‌‌లో బాబర్‌‌‌‌ ఫోర్‌‌‌‌తో ఖాతా తెరిచాడు. నాలుగో ఓవర్‌‌‌‌లోనే స్పిన్నర్‌‌‌‌ వరుణ్‌‌‌‌ చక్రవర్తిని తీసుకొచ్చినా వీళ్ల దూకుడుకు కళ్లెం పడలేదు. ఐదో ఓవర్‌‌‌‌లో చెరో ఫోర్‌‌‌‌ కొట్టారు.

పవర్‌‌‌‌ప్లేలో 43/0 స్కోరు చేయడంతో మ్యాచ్‌‌‌‌ పాక్‌‌‌‌ వైపు మొగ్గింది. ఫీల్డింగ్‌‌‌‌ విస్తరించిన తర్వాత ఈ ఇద్దరు షాట్స్‌‌‌‌ తగ్గించినా నింపాదిగా రన్స్‌‌‌‌ రాబట్టారు. సింగిల్స్‌‌‌‌, డబుల్స్‌‌‌‌తో స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేస్తూ ఓవర్‌‌‌‌కు ఆరు రన్‌‌‌‌రేట్‌‌‌‌ను నమోదు చేశారు. 8వ ఓవర్‌‌‌‌లో జడేజా బాల్‌‌‌‌ను సిక్సర్‌‌‌‌గా మలిచిన బాబర్‌‌‌‌, తర్వాతి ఓవర్‌‌‌‌లో ఫోర్‌‌‌‌ కొట్టాడు. దీంతో 10 ఓవర్లలో పాక్‌‌‌‌ 71/0 స్కోరుతో పటిష్ట స్థితికి చేరుకుంది.

బౌలర్లను ఎంత మార్చినా వికెట్‌‌‌‌ పడకపోడంతో ఇండియాపై ఒత్తిడి పెరిగిపోయింది. ఇక వరుణ్‌‌‌‌ వేసిన 13వ ఓవర్‌‌‌‌లో చెరో సిక్సర్‌‌‌‌తో 16 రన్స్‌‌‌‌ రాబట్టారు. నెక్స్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో బాబర్‌‌‌‌ మరో రెండు ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో బాబర్‌‌‌‌ 40 బాల్స్‌‌‌‌లో, రిజ్వాన్‌‌‌‌ 41 బాల్స్‌‌‌‌లో హాఫ్‌‌‌‌ సెంచరీలు కంప్లీట్‌‌‌‌ చేశారు. 15 ఓవర్లలో 121/0 స్కోరు చేయడంతో  పాక్‌‌‌‌ విజయానికి 30 బాల్స్‌‌‌‌లో 31 రన్స్‌‌‌‌ అవసరమయ్యాయి. తర్వాతి రెండు ఓవర్లలో 14 రన్స్‌‌‌‌ రాగా... షమీ వేసిన 18వ ఓవర్లో  రిజ్వాన్‌‌‌‌ 6, 4, 4 బాది పాక్​ను గెలిపించాడు. 
విరాట్‌‌‌‌ పోరాటం
షాహీన్​ దెబ్బకు చతికిలపడిన ఇన్నింగ్స్​ను విరాట్, సూర్యకుమార్‌‌ (11) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్రిది బాల్‌‌ను భారీ సిక్సర్‌‌గా మలిచి సూర్య టచ్‌‌లోకి రాగా, షాహీన్‌‌ థర్డ్‌‌ ఓవర్‌‌లో విరాట్‌‌ కూడా సిక్సర్‌‌ కొట్టి కాన్ఫిడెన్స్‌‌ను పెంచుకున్నాడు. కానీ ఇక్కడే ఇండియాను మళ్లీ దురదృష్టం వెంటాడింది. ఐదో ఓవర్‌‌లో హసన్‌‌ అలీ బాల్‌‌ను షాట్‌‌గా మల్చే ప్రయత్నంలో సూర్య స్లిప్‌‌లో రిజ్వాన్‌‌కు చిక్కాడు. దీంతో థర్డ్‌‌ వికెట్‌‌కు 25 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్​ అయింది. ఓవరాల్‌‌గా 36/3 స్కోరుతో ఇండియా పవర్‌‌ప్లే ముగించింది.

ఈ దశలో వచ్చిన స్పిన్నర్లు షాదాబ్‌‌ (1/22), హఫీజ్‌‌ మంచి టర్న్‌‌ రాబడుతూ.. స్కోరు బోర్డుకు కళ్లెం వేశారు. విరాట్‌‌తో జతకలిసిన పంత్‌‌ మధ్యలో రెండు ఫోర్లు కొట్టడంతో 7 నుంచి 10 ఓవర్ల మధ్య 24 రన్స్‌‌ వచ్చాయి. 12వ ఓవర్‌‌లో పంత్‌‌ బ్యాక్‌‌ టు బ్యాక్‌‌ సిక్సర్లతో 15 రన్స్‌‌ రాబట్టాడు. కానీ నెక్స్ట్‌‌ ఓవర్‌‌లోనే షాదాబ్‌‌కు రిటర్న్‌‌ క్యాచ్‌‌ ఇచ్చి వెనుదిరగడంతో నాలుగో వికెట్‌‌కు 53 రన్స్‌‌ భాగస్వామ్యం ముగిసింది. జడేజా (13) షాట్స్‌‌ కొట్టకపోయినా... కోహ్లీ వీలైనంతగా సింగిల్స్‌‌, డబుల్స్‌‌తో రన్‌‌రేట్‌‌ పెంచే ప్రయత్నం చేశాడు.

15వ ఓవర్‌‌లో స్కోరు 100కు చేరింది.16వ ఓవర్‌‌లో విరాట్‌‌ రెండు ఫోర్లతో జోరు పెంచాడు. కానీ 18వ ఓవర్‌‌లో ఓ ఫోర్‌‌ కొట్టిన జడ్డూ.. ఐదో బాల్‌‌కు ఔటయ్యాడు. ఐదో వికెట్‌‌కు 33 బాల్స్‌‌లో 41 రన్స్‌‌ సమకూరాయి. 19వ ఓవర్‌‌లో కోహ్లీ ఔట్‌‌కావడం, చివర్లో హార్దిక్‌‌ పాండ్యా (11) భారీ షాట్స్‌‌ ఆడకపోవడంతో ఇండియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమానికి టీమిండియా సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు పాక్‌తో మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఇండియా ప్లేయర్లంతా బౌండ్రీలైన్‌ దగ్గర మోకాళ్లపై  కూర్చున్నారు. బ్యాటింగ్‌ కోసం క్రీజులోకి వచ్చిన ఓపెనర్లు రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌ మోకాళ్లపై కూర్చోగా.. పాకిస్తాన్‌ ప్లేయర్లు మాత్రం తమ గుండెలపై చేతులు ఉంచి సంఘీభావం తెలిపారు.

ఇది నో బాల్ కాదా..

ఈ మ్యాచ్‌లో ఇండియా తక్కువ స్కోరు చేయడానికి కారణం ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఫెయిలవడమే.  షాహిన్‌ ఆఫ్రిది దెబ్బకు ఈ ఇద్దరూ ఔటయ్యారు. అయితే, షాహీన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయిన రాహుల్‌ను దురదృష్టం వెంటాడింది.  తను  నో బాల్‌కు ఔటయ్యాడు. రాహుల్‌ను బౌల్డ్‌ చేసిన డెలివరీకి ఆఫ్రిది  లైన్‌ దాటినట్టు కనిపించింది. కానీ, ఫీల్డ్‌ అంపైర్‌తో పాటు థర్డ్‌ అంపైర్‌ కూడా దీన్ని పట్టించుకోలేదు. దీనిపై ఇండియా ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాల్‌ వేసే ముందు  షాహిన్‌ కాలు లైన్‌ అవతలికి వెళ్లిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. ఇది నో బాల్‌ కదా? అంపైర్లు నిద్రపోతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
షాహీన్​ ఆఫ్రిది దెబ్బ..
భారీ అంచనాలతో క్రీజులోకి వచ్చిన టీమిండియాను స్టార్టింగ్‌‌లోనే పాక్‌‌ పేసర్‌‌ షాహీన్‌‌ ఆఫ్రిది వణికించాడు. అద్భుతమైన లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో పాటు మంచి స్వింగ్‌‌తో అదరగొట్టాడు. దీంతో ఇన్నింగ్స్‌‌ నాలుగో బాల్‌‌కే రోహిత్‌‌ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. యార్కర్‌‌ లెంగ్త్‌‌తో వేసిన బాల్‌‌.. డైరెక్ట్‌‌గా లోపలికి దూసుకురావడంతో హిట్‌‌మ్యాన్‌‌ గోల్డెన్‌‌ డకౌటయ్యాడు. ఈ దెబ్బ చాలదన్నట్లుగా.. ఆఫ్రిది తన తర్వాతి ఓవర్‌‌లో మరో ఝలక్‌‌ ఇచ్చాడు. ఇన్‌‌ స్వింగర్‌‌గా వచ్చిన గుడ్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ను డిఫెన్స్‌‌ చేయబోయి రాహుల్‌‌ (3) క్లీన్‌‌ బౌల్డ్‌‌ అయ్యాడు. మొత్తానికి 2.1 ఓవర్లలో 6 రన్స్‌‌ వద్ద ఓపెనర్లిద్దరూ పెవిలియన్‌‌కు చేరడంతో ఇండియా కష్టాల్లో పడింది. 
హార్దిక్‌ భుజానికి గాయం
ఇండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయపడ్డాడు. బ్యాటింగ్‌ చేస్తుండగా ఓ బాల్‌ తగిలి అతని భుజానికి గాయమైంది. దాంతో, అతను ఫీల్డింగ్‌ దూరంగా ఉండగా.. ఇషాన్‌ కిషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌గా వచ్చాడు. అనంతరం పాండ్యాను స్కానింగ్‌కు తీసుకెళ్లినట్టు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ తెలిపింది. గాయం తీవ్రత గురించి తెలియాల్సి ఉంది.
స్కోర్ బోర్డు:
ఇండియా: రాహుల్‌‌ (బి) షాహీన్‌‌ ఆఫ్రిది 3, రోహిత్‌‌ (ఎల్బీ) షాహీన్‌‌ ఆఫ్రిది 0, కోహ్లీ (సి) రిజ్వాన్‌‌ (బి) షాహీన్‌‌ ఆఫ్రిది 57, సూర్యకుమార్‌‌ (సి) రిజ్వాన్‌‌ (బి) హసన్‌‌ అలీ 11, రిషబ్‌‌ పంత్‌‌ (సి అండ్‌‌ బి) షాదాబ్‌‌ ఖాన్‌‌ 39, జడేజా (సి) (సబ్‌‌) నవాజ్‌‌ (బి) హసన్‌‌ అలీ 13, హార్దిక్‌‌ పాండ్యా (సి) బాబర్‌‌ ఆజమ్‌‌ (బి) హారిస్‌‌ రవూఫ్‌‌ 11, భువనేశ్వర్‌‌ (నాటౌట్‌‌) 5, షమీ (నాటౌట్‌‌) 0,

ఎక్స్‌‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 151/7.

వికెట్లపతనం: 1–1, 2–6, 3–31, 4–84, 5–125, 6–133, 7–146.

బౌలింగ్‌‌: షాహీన్‌‌ ఆఫ్రిది 4–0–31–3, ఇమాద్‌‌ వసీమ్‌‌ 2–0–10–0, హసన్‌‌ అలీ 4–0–44–2, షాదాబ్‌‌ ఖాన్‌‌ 4–0–22–1, హఫీజ్‌‌ 2–0–12–0, హారిస్‌‌ రవూఫ్‌‌ 4–0–25–1. 
పాకిస్తాన్‌‌: మహ్మద్‌‌ రిజ్వాన్‌‌ (నాటౌట్‌‌) 79, బాబర్‌‌ ఆజమ్‌‌ (నాటౌట్‌‌) 68, ఎక్స్‌‌ట్రాలు: 5,

మొత్తం: 17.5 ఓవర్లలో 152.

బౌలింగ్‌‌: భువనేశ్వర్‌‌ 3–0–25–0, షమీ 3.5–0–43–0, బుమ్రా 3–0–22–0, వరుణ్‌‌ చక్రవర్తి 4–0–33–0, జడేజా 4–0–28–0.