
- శ్వేతజాతీయేతర తొలి మహిళ నిలిచిన ముంబైకి చెందిన డాక్టర్ మాయా రాథోడ్
- ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీబిల్డింగ్ & ఫిట్నెస్ ఛాంపియన్షిప్ సాధించిన తొలి మహిళ
ఆశలు, కోరికలు ఉండడం అందరికీ సహజం.. అయితే వాటిని నెరవేర్చుకునే వారు అరుదు. అందునా మహిళలు మరీ అరుదు. అన్నీ ఉన్నా.. ఇంటా బయటా సహకారం మహిళలకు దొరకడం కష్టం. పెళ్లయి.. పిల్లల తల్లయ్యాక యవ్వనంలోని తన కోరికలను.. కెరీర్ ను అన్నీ పక్కన పెట్టేస్తుంటారు. అయితే చాలా కొద్దిమంది రియలైజ్ అయి ఎంతో కృషి పట్టుదలతో తమ ఆశలు, ఆశయాలు నెరవేర్చుకోవడం ద్వారా తామేంటో నిరూపించుకుంటారు. అందరికీ స్ఫూర్తి దాతగా నిలుస్తారు. ఇదే కోవకు చెందిన మహిళే ముంబైకి చెందిన డాక్టర్ మాయా రాథోడ్.
ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ మాయా రాథోడ్
మాయా రాథోడ్ చిన్నప్పటి నుంచి ఆటపాటల్లో చురుకు. స్కూలు అయిపోగానే నిత్యం గ్రౌండ్లలో మగ పిల్లలతో సమానంగా ఆటలాడేది. కాలేజీ స్థాయికి వెళ్లాక కూడా అంతే. సాయంత్రం అయిందంటే క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్ కు పరిగెత్తుకు వెళ్లేది. తల్లిదండ్రులకు ఈమె ఆటలంటే ఇష్టముండేది కాదు. కిందపడి గాయాలపాలైతే నీకు పెళ్లి కాదు అని భయపెట్టేవారు. అయినా పట్టించుకునేది కాదు. ఆటలపై దృష్టి మళ్లించేందుకు భరతనాట్యం చేర్పిస్తే.. అక్కడ డుమ్మా కొట్టి మైదానంలో వాలిపోయేది. కాలేజీలో ఏ స్ప్పోర్ట్స్ ఈవెంట్ జరిగినా వదిలేది కాదు. అన్నింట్లో పాల్గొని ఎన్నో బహుమతులు కైవసం చేసుకోవడం సంతోషం అనిపించేది. అయితే ఓ రోజు తండ్రి చాలా బాధపడడంతో ఆమె ఆటలకు ప్రాధాన్యత తగ్గించి చదువుపై దృష్టి పెట్టి మెడిసిన్ సీటు సాధించింది. అటు తర్వాత గైనకాలజీ పూర్తి చేసి తండ్రి కోరుకున్నట్టుగానే డాక్టర్ అయ్యింది. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా ఆరంకెల జీతంతో వృత్తిరీత్యా గైనకాలజిస్టుగా జీవితం సాఫీగా కొనసాగుతున్న క్రమంలో శారీరకంగా బరువు పెరిగిపోవడం తీవ్ర ఒత్తిడికి లోనైంది. చిన్నతనంలో గొప్ప అథ్లెట్ కావాలని కలలు కన్న తానేనా ఇలా మారిందన్న అసంతృప్తి వెంటాడుతుంటే పరిష్కారం కోసం స్నేహితుల సూచనల మేరకు జిమ్ లో చేరింది. కేవలం ఏడాది కాలంలోనే కసరత్తులన్నీ ప్రాక్టీస్ చేయడంతో 20కిలోల బరువు తగ్గింది. దీంతో జిమ్ లో కోచ్ సహా సహచరులంతా ఆశ్చర్యపోయి శభాష్ అని మెచ్చుకున్నారు. అంతే కాదు బాడీ బిల్డింగ్ చేయమని ప్రోత్సహించడంతో తన చిన్ననాటి కలలు గుర్తుకొచ్చాయి. భర్త కూడా తెలుసుకుని సహకరిచడంతో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేది. డాక్టరయి ఉండి.. మంచి జీతం సంపాదించుకుంటూ ఇలాంటివి అవసరమా అని బంధు మిత్రులు ఒకింత నిరాశపరచినా ఆమె భర్త సహకారంతో పట్టుదలతో బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టింది. బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్లిన కొత్తలో ఆడవాళ్ల కంటే అందరూ మగవాళ్లే ఎక్కువగా కనిపించడం కొంత అసౌకర్యంగా.. అసహనానికి గురిచేసినా భర్త ప్రోత్సహించడంతో అడుగు ముందుకే వేసింది. చిన్న పాప తల్లయినా కఠోర శిక్షణ కొనసాగించింది. చనుపాలు తాగే పాపతో ఇంట్లో.. ఆస్పత్రిలో డాక్టర్ గా.. డ్యూటీ అయ్యాక జిమ్ కు వెళ్లడం.. తిరిగి ఇంటికొచ్చాక వంటలు.. పాపతో క్షణం తీరికలేని జీవితంగా మారిపోయింది. అయినా కెరీర్ పై మక్కువతో విశ్రాంతి తీసుకునేందుకు నిరాకరిస్తూ ఇంటా బయటా టైమిగ్ బ్యాలెన్స్ చేసుకుంటూ బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనడం అలవాటు చేసుకుంది. అయితే రెండేళ్ల తర్వాత స్టేట్ లెవల్ చాంపియన్షిప్లో రెండో స్థానంలో నిలవడం కెరీర్ ను మలుపు తిప్పింది. బాడీ బిల్డర్ కెరీర్ ను కొనసాగించాలన్న ఊపు తెచ్చింది. ఈ క్రమంలో అటు డాక్టర్ గా పీహెచ్డీ పూర్తి చేసేందుకు మూడేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీకి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. అప్పుడే రెండో కూతురు పుట్టడంతో కెరీర్ కు బ్రేక్ పడినట్లే కనిపించినా అక్కడి జిమ్ లోని మహిళలు గత 25 ఏళ్లలో అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా భారతీయ మహిళా బాడీబిల్డర్ లేరని చెప్పడం కసిరేపింది. తానే ఎందుకు సాధించకూడదనుకుని పట్టుదలతో సాధన చేసి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బాడీబిల్డింగ్ అండ్ ఫిట్నెస్(ఐఎఫ్బీబీ) ఆస్ట్రేలియన్ చాంపియన్షిప్ లో పాల్గొని టైటిల్ గెలిచిన తొలి శ్వేతజాతీయేతర మహిళగా నిలిచింది. డాక్టర్.. ఇద్దరు పిల్లల తల్లి ఐఎఫ్ఎఫ్బీ 2021 ఆస్ట్రేలియన్ చాంపియన్షిప్ టైటిల్ సాధించడం సంచలనం రేపింది. ఆస్ట్రేలియా గడ్డమీద ఈ ఘనత సాధించిన తొలి నల్లజాతి మహిళ అంటూ పత్రికల్లో మీడియాలో ప్రచారం పతాక స్థాయిలో జరగడం అందరి దృష్టిని ఆకర్షించింది.
అంతర్జాతీయ మీడియా డాక్టర్ మాయా రాధోడ్ కృషిని గుర్తించి ఇంటర్వ్యూలు చేయడం.. పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రచురించడం భారతదేశంలో కూడా సంచలనం రేపింది. కొన్ని నెలల పాటు ఇంట్లో చిన్న పిల్లలతో.. డాక్టర్ కెరీర్ గా.. అటు తర్వాత బాడీ బిల్డర్ గా క్షణం వృధా చేయకుండా కఠోర సాధన చేసిన తీరు అందిరికీ స్ఫూర్తి దాయకంగా అయింది. గత ఎనిమిదేళ్లుగా బాడీ బిల్డర్ గా పోటీల్లో పాల్గొంటున్న డాక్టర్ మాయా రాథోడ్ వయస్సు 30 ఏళ్లే. పెళ్లి.. పిల్లల తర్వాత నేను ఇంతదాకా వస్తానని అస్సలు ఊహించలేదని.. జీవితంలో మనకు నచ్చింది చేసే అవకాశం రావడం.. ప్రోత్సహించే భర్త దొరకడంతో ఇంత విజయం సాదించగలిగానంటోంది మాయా రాథోడ్. ఇప్పుడు నేను తల్లిని, వైద్యురాలిని మాత్రమేకాదు బాడీ బిల్డర్ను కూడా అని గర్వంగా చెప్పుకుంటానంటూ ఓ ఇంటర్వ్యూలో తన విజయగాథ గురించి పంచుకున్నారు.