ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు  

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు  
  • ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు  
  • ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటికీ 20 ఏళ్ళు

డార్లింగ్గా తెలుగు ప్రేక్షకులచే పిలిపించుకునే ప్రభాస్ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఎవరు అనుకోలేదు.. కానీ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులకు సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ హీరోగా పరిచయం అయి అంటే హీరోగా తొలిసారి కెమెరా ముందుకు వచ్చి సరిగ్గా నేటితో 20 ఏళ్ళు పూర్తయింది. 2002 జులై 28న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ ఈశ్వర్ సినిమాని మొదలుపెట్టారు. ప్రభాస్పై ఆయన పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణంరాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్గా ఎదగమని దీవించారు.. కానీ ప్రభాస్ మాత్రం పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అప్పుడు ఆయనా ఊహించలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరోగా పరిచయం అవ్వడం అన్నది మొదటి సినిమా వరకే ఉపయోగపడుతుంది, కానీ ఆ తరువాత సినిమాలతో హీరోగా సత్తా చాటి పోటీకి తట్టుకుని ఎదగడం అన్నది వాళ్ళ వాళ్ళ సొంత టాలెంట్పై ఉంటుంది. అలా భిన్నమైన సినిమాలతో మాస్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ ఒక్కో సినిమాతో ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.  ఆయన నటిస్తున్న ఆదిపురుష్ సినిమాతో గ్లోబల్ స్టార్గానూ మారబోతున్నాడు. ఎందుకంటే ఆదిపురుష్ సినిమాను హాలీవుడ్ లోనూ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి నేటికీ 20 ఏళ్ళు పూర్తవడంతో అయన అభిమానులు ఈ ఇరవై ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు. ఆలిండియా రెబెల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షడు జె ఎస్ ఆర్ శాస్త్రి ( గుంటూరు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజు హైద్రాబాద్లో కృష్ణంరాజు ఇంట్లో ఈ సెలెబ్రేషన్స్ జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొందరు అభిమానులతో పాటు ఈశ్వర్ సినిమాను తెరకెక్కించి, ప్రభాస్ని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్లతో పాటు రెబెల్ స్టార్ కృష్ణంరాజు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్బంగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు మాట్లాడుతూ ..  ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది. నిజంగా ఆ రోజు ప్రభాస్ని హీరోగా పరిచయం చేద్దామని ముందు మేమె అనుకున్నాం. మా గోపి కృష్ణ బ్యానర్లో ప్రభాస్ని పరిచయం చేయాలనీ అనుకున్న తరువాత ఒకరోజు నిర్మాత అశోక్ కుమార్, దర్శకుడు జయంత్ వచ్చి ప్రభాస్ని పరిచయం చేసే అవకాశం మాకు ఇవ్వమని అడిగారు. ఈశ్వర్ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. మంచి మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ, తప్పకుండా అందరికి బాగా నచ్చుతుందన్న నమ్మకంతో అశోక్ కుమార్కు ఓకే చెప్పాము. జయంత్, అశోక్ ఇద్దరు కలిసి ఎంతో బాధ్యతగా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుని ప్రభాస్ని హీరోగా నిలబెట్టింది. పైగా ఆ సినిమాలో అశోక్ కుమార్ చెడ్డ తండ్రి పాత్రలో నటించడం గొప్ప విషయం. ఒక నిర్మాత అయి ఉండి ఆ సినిమాలో విలన్గా నటించాడంటే అయన గట్స్కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రభాస్ మొదటి సినిమా చూశాకా తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ.. ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదల ముఖ్యంగా మా అభిమానుల అండదండలు ఉన్నాయి. ప్రభాస్ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. 

ఈశ్వర్ సినిమా డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ .. నిజంగా నేను పరిచయం చేసిన హీరో ఈ రోజు ఒక పాన్ ఇండియా స్టార్ గా అవుతాడని ఎప్పుడు అనుకోలేదు . ప్రభాస్ నిజంగా గొప్ప వ్యక్తి . ఈ మధ్య కూడా తనను కలిసాను, ఈశ్వర్ సమయంలో ఎలా ఉండేవాడో అదే అభిమానాన్ని కలిగి ఉన్నాడు. అంత పెద్ద హీరో అన్న గర్వం ఏ కోశానా లేదు. నిజంగా నా హీరో ఈ రేంజ్ కి వెళ్లడం మరచిపోలేని అనుభూతి. ఇక ఈశ్వర్ సమయంలో ప్రభాస్ తో ఉన్న రోజులు కూడా మరచిపోలేము. ఈ సినిమా సమయంలో కథ అనుకున్న తరువాత చాలా మంది హీరోలను పరిశీలించాను, అయితే ఓ కాఫీ షాప్ లో ప్రభాస్ ని చూసి ఈ అబ్బాయి బాగా ఉన్నాడు. మన కథకు సరిపోతాడని చెప్పగానే అశోక్ వెళ్లి కృష్ణం రాజునూ కలవడం అయన మేమె పరిచయం చేస్తామని కాకుండా మమ్మల్ని నమ్మి హీరోని ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. మాకు సపోర్ట్ అందించిన కృష్ణం రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ప్రభాస్.. ఈశ్వర్, వర్షం, రాఘవేంధ్రా, పౌర్ణమి, డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, బాహుబలి లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.