
‘నా దేశం నుండి ఒక పిడికెడు మట్టిని కూడా తీసుకోలేకపోయాను. కానీ, విమానం ఎక్కే ముందు నా మాతృభూమిని తాకగలిగాను. అక్కడి మహిళలు నన్నెంతో ప్రేమించేవారు. ఎన్నో సమస్యలపై పార్లమెంట్లో పోరాడాను. దేశాన్ని విడిచి వెళ్తుంటే, మనసు మెలిపెట్టింది. ఆ బాధ తట్టుకోలేక పోయాను. ఈ మాటలు అన్నది అఫ్గాన్ చట్టసభలో మొదటి నాన్–ముస్లిం విమెన్ ఎంపీ అనార్కలి కౌర్. ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్ ఆదివారం , జూన్ 22–ఉదయం 10 గంటలు కాబూల్ ఎయిర్‌పోర్టు దగ్గర గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాలిబాన్ ఆక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్ నుంచి బయటపడేందుకు జనం వేలాదిగా కాబూల్ విమానాశ్రయానికి వెళ్తున్నారు. అక్కడున్న మన వాళ్లను తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం సీ–17 హిండన్ ఎయిర్‌బేస్‌లో రెడీగా ఉంది. ఆ విమానంలో మనవాళ్లతో పాటు అఫ్గనిస్తాన్‌కు చెందిన పలువురు నాయకులు, అధికారులు ఎక్కారు. వాళ్లలో అనార్కలి కూడా ఉంది. తల్లితోపాటు ఢిల్లీకి వచ్చిన ఆమె ఓ హోటల్లో ఉంది. అక్కడ విమానం ఎక్కుతుంటే తన మనసులో అనిపించింది ఒక్కటే.. ‘తిరిగి నా మాతృభూమికి ఎప్పుడు వస్తాను?’ అని. ఢిల్లీకి వచ్చిన ఆమె అఫ్గాన్ గురించి ఎమోషనల్ అయింది. అఫ్గానిస్తాన్ పార్లమెంట్లో ఎన్నో సమస్యల మీద పోరాడిన మొదటి నాన్ ముస్లిం ఎంపీగా అనార్కలికి ఎంతో పేరుంది. కానీ, తాలిబాన్లు ఆక్రమించిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
‘ నా దేశం నుంచి పిడికెడు మట్టిని కూడా తెచ్చుకోలేక పోయాను’ అని కన్నీరు పెట్టింది. ‘అఫ్గానిస్తాన్ నుంచి నా కొలీగ్స్, ఫ్రెండ్స్ రోజూ మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. నేను సురక్షితంగా ఉన్నా అనుకుంటున్నారు. కానీ, దేశాన్ని, ప్రజలను విడిచి నేను ఇక్కడ ఎలా ఉండగలుగుతాను. రోజూ వస్తున్న ఆ ఫోన్ కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడం చాలా బాధగా అనిపిస్తోంది’ అని బాధపడింది.
చదువుతున్నప్పుడు..
అనార్కలి వృత్తిరీత్యా డాక్టర్. కాబూల్ యూనివర్సిటీ లో మెడిసిన్ చదువుకుంది. యూనివర్సిటీ నుంచే ఆమె హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టింది. మత పరమైన విషయాల్లో మహిళలను, ఇతరులను రక్షించేందుకు ఎంతో కృషి చేసింది. 2006లో ‘అఫ్గాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్’ గా చేరింది. మహిళల హక్కుల కోసం పోరాడిన కార్యకర్తగా 2009 లో అఫ్గానిస్తాన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తింపు పొందింది. 2010లో ఆమె తొలిసారి ఎంపీగా ఎన్నికై.. అఫ్గాన్ చట్టసభలో మొదటి నాన్ ముస్లిం సభ్యురాలిగా చరిత్ర సృష్టించింది. ఆమె సేవలకు గాను యునెస్కో కూడా ఆమెను సత్కరించింది.