
- పైనుంచి వచ్చిన వరదకు ఖమ్మంలో వర్షంతోడు కావడమే కారణం
- ఈసారి పై నుంచి వరద వచ్చినప్పుడు ఇక్కడ వర్షం లేదు..
- ఇక్కడ వర్షం ఉన్నప్పుడు పైనుంచి వరద రాలేదు
- జిల్లాలో ఈసారి ఇప్పటి వరకు సాధారణం కంటే 58 శాతం ఎక్కువ వర్షాలు
ఖమ్మం, వెలుగు: మున్నేరు వరద ముంపు నుంచి ఖమ్మం నగరం ఈ ఏడాది సేఫ్ అయినట్టే కనిపిస్తోంది. గతేడాది ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో వచ్చిన భారీ వరదలతో ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని పలు గ్రామాలు, కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 18 డివిజన్లలో 30కి పైగా కాలనీలు, ఖమ్మం రూరల్ మండలంలో 8 గ్రామాలు, తిరుమలాయపాలెం మండలాల్లో మున్నేరు, ఆకేరును ఆనుకొని ఉన్న గ్రామాల్లో పంట, ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 3 వేల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి.
గతేడాది 24 గంటల వ్యవధిలోనే ఖమ్మంలో 42 సెంటీమీటర్ల వర్షం పడడానికి తోడు, మున్నేరు, ఆకేరుకు ఎగువ ప్రాంతాలైన మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం పడడంతో ఆయా వాగులు పోటెత్తాయి. పైనుంచి వచ్చిన వరదకు ఖమ్మంలో పడిన భారీ వర్షాలు కలవడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం కాల్వొడ్డు సమీపంలో మున్నేరు 38 అడుగులకు పైగా ప్రవహించింది. మున్నేరు సామర్థ్యం మూడున్నర లక్షల క్యూసెక్కులు కాగా, గతేడాది అత్యధికంగా నాలుగున్నర లక్షల క్యూసెక్కులు ప్రవహించినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ఖమ్మం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాలనీలు, గ్రామాలు ముంపునకు గురయ్యాయి. గతేడాది వరదల్లో జిల్లాలో ఆరుగురు చనిపోయారు.
ఈ ఏడాది వరదలు విభిన్నం!
ఈ వర్షాకాలం సీజన్ లో ఖమ్మం జిల్లాలో వర్షాల పడుతున్న తీరు కారణంగా వరద ముంపు తప్పింది. మున్నేరు, ఆకేరుకు వరద వచ్చే ఎగువన జిల్లాలైన మహబూబాబాద్, జనగామ, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన సమయంలో ఖమ్మం జిల్లాలో వర్షాలు పడలేదు. మూడ్నాలుగు రోజుల కింద ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిసిన సమయంలో పై నుంచి వరద లేకపోవడం కలిసివచ్చింది. ఈ ఏడాది ఇప్పటి వరకు మున్నేరు 16 ఫీట్లను మించి ప్రవహించలేదు. కాల్వొడ్డు సమీపంలో అత్యధికంగా 70 వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే రికార్డు అయింది.
దీంతో ఖమ్మం నగరంలో ఒకట్రెండు లోతట్టు ప్రాంతాల్లో కొద్ది గంటల పాటు మాత్రమే వరద ప్రభావం కనిపించింది. వెంటనే ఆయా కాలనీల్లోనే నీరు బయటకు వెళ్లిపోయేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంతో పెద్దగా నష్టం కనిపించలేదు. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలో 1,061 చెరువులకు గాను 567 అలుగు పోస్తున్నాయి. 267 చెరువులు 90 శాతం నుంచి 100 శాతం వరకు నిండగా, 91 చెరువులు 75 శాతం నుంచి 90 శాతం వరకు, 102 చెరువులు 50 శాతం నుంచి 75 శాతం వరకు 26 చెరువులు 25 శాతం నుంచి 50 శాతం వరకు, 8 చెరువులు 25 శాతం వరకు
నిండాయి.
ఈ ఏడాది అధిక వర్షపాతమే!
ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు అధిక వర్షపాతమే నమోదైంది. జూన్, జులైలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులో మాత్రం సాధారణం కంటే 58 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. ఆగస్టులో 16 రోజుల పాటు వర్షపాతం నమోదు కాగా, సాధారణ వర్షపాతం 223 మిల్లీమీటర్లకు గాను 354 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.