- మన్యంలో స్థలసేకరణ పూర్తి.. త్వరలో టెండర్లు
- అందుబాటులోకి వస్తే నిరంతర విద్యుత్ సరఫరాకు లైన్ క్లియర్
భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో విద్యుత్ అంతరాయాలకు చెక్‌పెట్టేందుకు ట్రాన్స్ కో యాక్షన్‌ప్లాన్ తయారు చేసింది. భద్రాచలం ట్రాన్స్ కో డివిజన్ పరిధిలోని బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో కొత్తగా రెండు సబ్ స్టేషన్లను మంజూరు చేసింది.
ఒక్కో సబ్ స్టేషన్‌కు రూ.2కోట్లు నిధులు కేటాయించారు. నిర్మాణానికి అవసరమయ్యే స్థలాన్ని రెవెన్యూశాఖ సర్వే చేసి ట్రాన్స్ కోకు అప్పగించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్‌లోని ఆఫీస్‌కు పంపించారు. త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ రెండు సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తయితే మారుమూల గ్రామాల్లో ఇక నిరంతర విద్యుత్ సరఫరాకు లైన్ క్లియర్ అవుతుంది.
మన్యంలో అతిపెద్ద మండలం దుమ్ముగూడెం
మన్యంలో అతిపెద్ద మండలం దుమ్ముగూడెం. చత్తీస్‌గఢ్ బార్డర్‌ను ఆనుకుని గిరిజన పల్లెలు ఉన్నాయి. ప్రస్తుతం దుమ్ముగూడెం, పర్ణశాల, లచ్చిగూడెంలో ఇప్పటికే సబ్స్టేషన్లు ఉన్నాయి. విలీన ఎటపాక మండల కేంద్రం నుంచి దుమ్ముగూడెంకు విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ మండలంలోని నర్సాపురం ఫీడర్‌కు విద్యుత్ సరఫరా జరిగి అక్కడ నుంచి పరిసర గ్రామాలకు వెళ్తోంది. అయితే మార్గం మధ్యలో తరుచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీనివల్ల లోపాన్ని గుర్తించి సరఫరా పునరుద్ధరణకు ట్రాన్స్ కో సిబ్బందికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో సీతారాంపురంలో కొత్తగా సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఈ సమస్యలకు చెక్ పడుతుంది. సుమారు 4వేల సర్వీసులకు లబ్ధి చేకూరుతుంది.
ప్రధానంగా వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ కూడా అందుతుంది. ఈ సబ్ స్టేషన్ పరిధిలోనే వ్యవసాయ బోర్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర నుంచి ముసలిమడుగు పరిసర గ్రామాలకు సరఫరా జరుగుతోంది. కానీ మధ్యలో అవాంతరాలు ఏర్పడి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. దీన్ని అధిగమించేందుకు ముసలిమడుగు గ్రామంలో కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. బూర్గంపాడు మండలంలో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్ సర్వీసులు కూడా ఎక్కువే. కొత్త సబ్‌స్టేషన్ వల్ల గృహవినియోగదారులకు, రైతులకు మేలు జరుగుతుంది.
పర్ణశాల సబ్‌స్టేషన్ తరలింపు
దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల సబ్‌స్టేషన్ ఎంతో కీలకం. కానీ చిన్నపాటి వరదలకే ఈ సబ్‌స్టేషన్‌కు మునుగుతోంది. గోదావరి పొంగితే పలు గ్రామాలకు కరెంట్‌కట్ అవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో ఈ సబ్‌స్టేషన్‌ను చినబండిరేవు గ్రామానికి తరలిస్తున్నారు. పనులు కూడా పూర్తి కావొచ్చాయి. త్వరలో ఈ తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తారు. మరోవైపు గోదావరి తీరం వెంట ఉన్న విద్యుత్ స్తంభాలను మెరక ప్రాంతాలకు మార్చారు. 70 అడుగుల గోదావరి వరద వచ్చినా దుమ్ముగూడెం మండలానికి విద్యుత్‌ను అంతరాయం లేకుండా అందించేలా ట్రాన్స్ కో పనులు పూర్తి చేసింది. మరోవైపు సాంకేతిక లోపాలను అన్వేషించేందుకు ఎఫ్‌పీఐ(ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్)లను కూడా ఏర్పాటు చేశారు.
చింతలగూడెం, తూరుబాక, నడికుడి, ఆర్లగూడెం, బైరాగులపాడు, చిన్నబండిరేవు జంక్షన్లలో వీటిని పెట్టారు. ఎప్పుడైనా సరఫరాకు అంతరాయం ఏర్పడితే లోపం ఎక్కడుందో తెలుసుకోవాలంటే లైన్ మొత్తం వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఎఫ్‌పీఐల ఏర్పాటు వల్ల లోపం ఉన్న ప్రాంతంలో లైట్ బ్లింక్ అవుతూ సిబ్బందికి కనబడుతుంది. మొత్తం తిరిగే పని లేకుండా ఆ ప్రాంతంలోనే లోపాన్ని సరిచేసి సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.
త్వరలో రెండు సబ్ స్టేషన్ల నిర్మాణాలు
భద్రాచలం డివిజన్లోని బూర్గంపాడు మండలం ముసలిమడుగు, దుమ్ముగూడెం మండలంలోని సీతారాంపురంలో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం జరగనుంది. భూసేకరణ పూర్తయ్యింది. టెండర్ల దశలో ఉంది. ఇవి పూర్తయితే నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా జరగుతుంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ మారుమూల గ్రామాలకు సైతం విద్యుత్ సరఫరా చేస్తున్నాం. జీవన్‌కుమార్, డీఈ, భద్రాచలం
