తండ్రి చంపినప్పుడే జైల్లో వేసి ఉంటే.. ఇప్పుడు వీళ్లు బతికేవాళ్లు కదా..!

తండ్రి చంపినప్పుడే జైల్లో వేసి ఉంటే.. ఇప్పుడు వీళ్లు బతికేవాళ్లు కదా..!
  • వెలుగులోకి వస్తున్న  ప్రేమోన్మాది శివకుమార్​  నేర చరిత్ర
  • ఆ హత్య కేసును బయటకు రానివ్వని నేరెళ్ల చెరువు గ్రామస్తులు
  • తాజాగా మరో హత్యతో గ్రామంలో అలజడి

షాద్ నగర్, వెలుగు: ఎల్​బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఆదివారం ప్రేమోన్మాది కుమ్మరి శివకుమార్‌ రెచ్చిపోయినది తెలిసిందే. తన ప్రేమను నిరాకరించిందని కక్షగట్టి యువతిపై, ఆమె సోదరుడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తి పోట్లతో యువతి సోదరుడు మృతి చెందగా.. ఆమె పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే ఘాతుకానికి పాల్పడిన నిందితుడు శివకుమార్‌ది రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నేరెళ్లచెరువు. అతనికి గతంలోనే  నేర చరిత్ర ఉన్నట్లు తెలిసింది. డిగ్రీ పూర్తి చేశాక.. సినిమా చాన్స్ ల కోసమంటూ కొన్నాళ్లు సిటీలో ఖాళీగా తిరిగాడు. దీంతో ఇంట్లో గొడవకు దారి తీసింది. మూడేళ్ల కిందట అతడిని తండ్రి కుమ్మరి శంకరయ్య మందలించడంతో.. విచక్షణ కోల్పోయి సుత్తితో కొట్టడంతో మరణించాడని గ్రామస్తులు గుర్తు చేశారు. 

కుటుంబానికి ఒక్కడే కొడుకు కావడం, ఆవేశంలో చేసిన తప్పునకు అతడి భవిష్యత్​ ఏమవుతుందోననే ఉద్దేశంతోనే గ్రామపెద్దలు హత్య కేసును అప్పట్లో బయటకు రానివ్వలేదు. శంకరయ్యది సహజ మరణంగా చూపించి అంత్యక్రియలు చేశారని పేర్కొంటున్నారు. నిందితుడిని వదిలిపెట్టినందునే ఇప్పుడు మరో ఘాతుకానికి పాల్పడ్డాడని అంటున్నారు. అయితే... శంకరయ్య హత్య కేసును దాచిపెట్టిన కొందరు గ్రామ ప్రజాప్రతినిధులు, ఇతర పెద్దలకు ప్రస్తుతం ఉచ్చు బిగిస్తున్నట్టు సమాచారం. అనాడే శివకుమార్ ను చట్టపరంగా శిక్షించేందుకు అప్పగిస్తే.. అతడిలో మార్పు వచ్చేదని, ప్రస్తుతం సైకోలా మారి మరో హత్యకు పాల్పడ్డాడని పేర్కొంటున్నారు. నిందితుడు శివకుమార్‌ గత నేర చర్రితపైనా విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

ఎన్ కౌంటర్ చేయండి

ప్రేమోన్మాది శివకుమార్ ను ఎన్ కౌంటర్ చేయాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన పృథ్వీ గౌడ్  డెడ్ బాడీకి సోమవారం ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పృథ్వీ సొంతూరు షాద్ నగర్ లోని కొందుర్గ్ కు తీసుకెళ్లారు. డెడ్ బాడీని తీసుకెళ్తున్న వాహనాన్ని బంధువులు, గ్రామస్తులు అడ్డుకుని, నిందితుడిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్, బీజేపీ నేతలు మాట్లాడుతూ.. దిశకు ఒక న్యాయం, సంఘవికి ఒక న్యాయమా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు కలుగజేసుకొని పృథ్వీగౌడ్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పగా ధర్నా విరమింపజేశారు.