మద్యం మత్తులో కుటుంబాలు చిత్తు

మద్యం మత్తులో  కుటుంబాలు చిత్తు
  •     ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్​ చేసుకుంటున్రు
  •     జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న మందు బాధితులు
  •     బెల్ట్​షాపుల్లో జోరుగా సాగుతున్న దందా
  •     పట్టించుకోని ఎక్సైజ్​అధికారులు

కామారెడ్డి, వెలుగు ; తాగిన మైకంలో అనేకమంది కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. కొందరు సూసైడ్​లు చేసుకుంటుండగా, మరికొందరి మైకంలో సొంతవారినే చంపుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం జిల్లాలోని ఏదో మూలన జరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో జోరుగా మద్యం అమ్మకాలు జరుగుతుండడం ఇందుకు కారణం. నెలకు రూ.22 కోట్ల నుంచి రూ.23 కోట్ల విలువైన మందు బాటిళ్లు సేల్​ అవుతున్నాయి. గ్రామాల్లోనూ బెల్టుషాపులు పెట్టి విచ్చలవిడిగా మందు అమ్ముతున్నారు. రాత్రింబవళ్లు తేడా లేకుండా ఊళ్లల్లోనూ మందు దొరుకుతుండడంతో చాలా మంది తాగుడుకు  బానిసవుతున్నారు. యువకులు, రైతులు ఇలా అన్ని వర్గాల వాళ్లు తాగుడుకు బానిసై, ఆర్థికంగా చిక్కిపోతున్నారు. తాగేందుకు అప్పులు చేస్తున్నారు. ఇదే అదునుగా భావించి అప్పులు ఇచ్చే వాళ్లు ఎక్కువ మిత్తి వసూలు చేస్తున్నారు. దీంతో అనేక ఫ్యామిలీలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, బిచ్కుంద మండలాల్లో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి. మాచారెడ్డి మండలం భవానీపేటలో ఓ వ్యక్తి  తాగుడుకు బానిసై మద్యం మత్తులో తల్లిని రోకలి బండతో చంపి, తానూ తల పగులగొట్టుకొని చనిపోయాడు. 

ఆదర్శంగా నర్సన్నపల్లి

కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో 2 వేల మంది ఉంటారు. ఇక్కడ ఒక బెల్ట్​షాప్ ​నడిచేది. అందుబాటులో మందు దొరకుతుండడంతో తాగిన మైకంలో గ్రామంలో గొడవలు అధికమయ్యాయి. మందు తాగడం వల్ల జరిగే అనార్థాలను గ్రహించిన గ్రామస్తులు ఈ నెల 11న సమావేశమై ఊరిలో మందు అమ్మకంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని తీర్మానించారు.

బెల్టుషాపులకు భారీ డిమాండ్​

గ్రామాల్లో బెల్టుషాపులకు భారీ డిమాండ్​ఉంది. రూ.లక్షల్లో వేలంపాడి షాప్​లు దక్కించుకుంటున్నారు. ఇటీవల భిక్కనూరు మండలం జంగంపల్లిలో  బెల్టుషాప్​కు వేలం నిర్వహించగా అయిదుగురు పోటీపడ్డారు. ఓ వ్యక్తి ఏకంగా రూ.19.85 లక్షలకు దక్కించుకున్నాడు. వేలంలో షాప్​దక్కించుకున్న వ్యక్తే ఏడాదిపాటు మందు అమ్మాలి. ఎక్కువ రేటుకు అమ్మినా ఎవరూ అడగరు. ప్రతీ సీసాపై రూ.20 నుంచి రూ.40 ఎక్కువ వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా.. అబ్కారీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్​పల్లికి చెందిన నాగర్తి నరేశ్​రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. దీనికి తోడు అప్పులు ఎక్కువయ్యాయి. సమస్యలు ఎక్కువయ్యాయని తాగిన మైకంలో ఉరేసుకొని చనిపోయాడు. యువకుడి ఆత్మహత్య స్థానికులను కలిచివేసింది. గ్రామంలో మందు అమ్మొద్దంటూ తీర్మానించారు. అమ్మిన వారిపై రూ.5 లక్షల జరిమానా విధిస్తామని ప్రకటించారు.
 

లింగంపేట మండలం ఎక్కపల్లికి చెందిన రాజమొల్ల అనిల్ (25) అనే యువకుడు మద్యానికి బానిసై,ఈ నెల 7న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవించే అనిల్ కి​ తాగుడు ఎక్కువ అవ్వడం, అప్పులపాలు కావడంతో సూసైడ్​ చేసుకున్నట్లు మృతుడి తండ్రి పోచయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.