సిండికేట్లకే షాపులు.. నలుగురైదుగురు కలిసి వేసిన టెండర్లకే ఎక్కువగా దక్కిన వైన్స్లు

సిండికేట్లకే షాపులు..  నలుగురైదుగురు కలిసి వేసిన టెండర్లకే ఎక్కువగా దక్కిన వైన్స్లు
  • నిర్మల్​లో ఓ మహిళకు రెండు దుకాణాలు
  • మంచిర్యాలలో 16 మంది మహిళలకు..
  • ఆసిఫాబాద్​లో 7, ఆదిలాబాద్​లో 6 షాపులకు డ్రా వాయిదా
  • తక్కువ అప్లికేషన్లు రావడమే కారణం

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని 192 మద్యం దుకాణాలకు సోమవారం నిర్వహించిన లక్కీ డ్రా మద్యం వ్యాపారులకు కిక్కెక్కించింది. మొత్తం 4,144 దరఖాస్తులు రాగా.. లక్కీ డ్రా ద్వారా 179 షాపులను కేటాయించారు. ఆదిలాబాద్​లో 6, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 7 దుకాణాలకు 10 కంటే తక్కువ దరఖాస్తులు రావడంతో డ్రాను వాయిదా వేశారు. నలుగురైదుగురు కలిసి వేసిన టెండర్లకే ఎక్కువగా షాపులు దక్కాయి. నిర్మల్​లో ఓ మహిళ పేరిట 2 షాపులు రాగా, మంచిర్యాల జిల్లాలో 16 దుకాణాలు మహిళలకే దక్కాయి. షాపులు వచ్చినవారు సంతోషం వ్యక్తం చేయగా, రానివారు నిరాశ చెందారు. అప్లికేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.124.32 కోట్ల ఆదాయం సమకూరింది.  

నిర్మల్, వెలుగు: జిల్లాలో మొత్తం 47 మద్యం దుకాణాల కోసం సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన టెండర్​లక్కీ డ్రా పలువురికి లక్కును తీసుకొచ్చింది. ఎక్సైజ్ అధికారుల సమక్షంలో కలెక్టర్ అభిలాష అభినవ్ డ్రా తీశారు. మొత్తం 981 అప్లికేషన్లు రాగా.. ఈసారి నలుగురైదుగురు కలిసి ఎక్కువ మొత్తంలో టెండర్లు వేశారు. ఈ కారణంగా చాలా దుకాణాలు వ్యాపారంలో భాగస్వాములు, స్నేహితులకే దక్కాయి. జిల్లాలోని పొన్కల్, లక్ష్మణచాంద షాపులు హారిక అనే మహిళకు దక్కాయి. నిర్మల్ పట్టణంలోని బేస్తవారిపేటకు చెందిన ఈమె భర్త కిశోర్ కొంతమంది పార్ట్​నర్స్​తో కలిసి ఆమె పేరిట అప్లై చేశాడు. 

కాగా, నిర్మల్ పట్టణంలోని పలు దుకాణాలను కొంతమంది స్నేహితులే సిండికేట్ గా ఏర్పడి, డ్రాలో దక్కించుకున్నారు. ఇంకొందరికి నిర్మల్ జిల్లాలోనే కాకుండా జగిత్యాల, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కూడా మద్యం దుకాణాలు నిర్వహించిన అనుభవం ఉంది. వీరు నిర్మల్ తోపాటు పొరుగు జిల్లాల్లోనూ దరఖాస్తు చేసి, రెండు, మూడు షాపులను గెలుచుకున్నారు. దరఖాస్తుదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. 

ఆసిఫాబాద్​లో 32 షాపులు..

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో మద్యం దుకాణాలకు సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అడిషనల్ కలెక్టర్ డేవిడ్, జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్ తో కలిసి డ్రా తీశారు. జిల్లాలో 32 షాపులకు 680 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో రెబ్బెన షాప్ నంబర్ 9, గోలేటి షాప్ నంబర్ 10, కాగజ్ నగర్ సర్ సిల్క్ ఏరియా షాప్ 14, రవీంద్ర నగర్ 22 , జైనూర్–1 షాప్ నంబర్ 30, జైనూర్–-2 షాప్ నంబర్ 31, సిర్పూర్ (యు) షాప్ నంబర్ 32 దుకాణాలకు తక్కువ అప్లికేషన్లు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రా నిలిపివేశారు. మిగతా 25 దుకాణాలను లక్కీ డ్రా ద్వారా కేటాయించారు. ఈ జిల్లాలోనూ నలుగురైదుగురు కలిసి వేసిన టెండర్లకే చాలావరకు షాపులు దక్కాయి.

ఆదిలాబాద్​లో 40 దుకాణాలు..

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: ఆదిలాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఫంక్షన్​హాల్​లో సోమవారం మద్యం షాపులకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్​ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రఘురామ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ సమక్షంలో డ్రా తీశారు. 

జిల్లాలోని 40 మద్యం దుకాణాలకు 771 దరఖాస్తులు రాగా.. డ్రా ద్వారా34 షాపులను కేటాయించారు. మరో 6  దుకాణాలు ఆదిలాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 16, 17, 18 తాంసి, తలమడుగు, భీంపూర్, ఇచ్చోడ పరిధిలో 25, 28 అడెగామ, సిరికొండ, ఉట్నూర్ స్టేషన్ పరిధిలో లోకారి 40 నంబర్ షాపులకు తక్కువ అప్లికేషన్లు రావడంతో వాయిదా వేశారు.

మంచిర్యాలలో 73 షాపులకు..

మంచిర్యాల, వెలుగు: మద్యం షాపుల కేటాయింపునకు సోమవారం శ్రీరాంపూర్​లోని పీవీఆర్ గార్డెన్స్​లో కలెక్టర్​ కుమార్ దీపక్​ నేతృత్వంలో లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలోని 73 షాపులకు 1,712 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా తీసి, దుకాణాల లైసెన్సులను కేటాయించారు. టోకెన్లను అందరికీ చూపిస్తూ ఫొటో, వీడియో రికార్డు చేస్తూ పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టారు. మొత్తం వైన్స్​లో 16 మహిళలకే దక్కాయి. దుకాణాలు పొందినవారి నుంచి ఎక్సైజ్​ అధికారులు రూల్స్ ప్రకారం లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. ఏసీపీ ప్రకాశ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.