
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పరిసరాల పరిశుభ్రత పాటించాలని మహబూబాబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. డ్రై డేలో భాగంగా శుక్రవారం నగరంలోని పలు కాలనీలను ఆకస్మిక తనిఖీ చేశారు. వినాయక్ నగర్, ఎదిర, శేషాద్రి నగర్, బీకే రెడ్డి కాలనీలను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలు ఇంటి పరిసరాల్లో చెత్త, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలని చెప్పారు. వినాయక్ నగర్లో ఇండ్ల నుంచి వచ్చిన మురుగు, వరద నిల్వ ఉండడం చూసి మట్టి వేసి నీటి నిల్వ లేకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు.
ఎదిర లో ఓపెన్ ప్లాట్లలో వర్షపు నీరు గమనించి వెంటనే క్లీన్ చేయడానికి ఓపెన్ ప్లాట్ యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. అంతకుముందు బీకే రెడ్డి కాలనీలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను సందర్శించి అనారోగ్యంగా ఉన్న విద్యార్థులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. ఆహారంలో అందించే గుడ్డు చిన్నగా ఉండడంతో ఇలాంటి ఎగ్స్‌ను తిరస్కరించాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్చార్జి ప్రిన్సిపల్ ను తొలగించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారిని ఆదేశించారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శశి కాంత్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా ఇబ్బందులు రావొద్దు
రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఫెర్టిలైజర్ డీలర్స్, వ్యవసాయ శాఖ ఏడీలు, మండల వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ యూరియా ఇబ్బందులు రావొద్దని, బ్లాక్ మార్కెట్లో అమ్మిన డీలర్ల లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. నానో యూరియా పై రైతులకు అవగాహన కల్పించాలని డీలర్స్ కు సూచించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, వ్యవసాయాధికారి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.