
- భవిష్యత్ కార్యాచరణ సదస్సులో వక్తలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: మాలలను గ్రూప్–-3లో చేర్చి రోస్టర్ పాయింట్ 22 కేటాయించడం వల్ల తీవ్ర అన్యాయానికి గురవుతున్నామని పలువురు మాల ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఎస్సీ వర్గీకరణ-2025 రోస్టర్ విధానం వల్ల మాలలకు జరుగుతున్న అన్యాయం, భవిష్యత్ కార్యాచరణ’ పై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. శాతవాహన వర్సిటీలో 35 పార్ట్‌టైమ్ లెక్చరర్ ఉద్యోగాల నోటిఫికేషన్లో ఎస్సీలకు కేటాయించిన 6 ఉద్యోగాల్లో మాల కులానికి ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్నారు.
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్లో ఎస్సీలకు 126 ఉద్యోగాలు కేటాయించగా, మాలలకు కేవలం 26 మాత్రమే దక్కాయన్నారు. మాలలకు రోస్టర్ పాయింట్ 22ని 16కి మార్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆగస్టు ఒకటిని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల బ్లాక్ డేగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఆ రోజు హైదరాబాద్‌ను అష్ట దిగ్బంధనం చేసి, మాలల మహా ధర్నా నిర్వహిస్తామన్నారు. సదస్సుకు డాక్టర్ మంచాల లింగస్వామి అధ్యక్షత వహించగా, బత్తుల రాంప్రసాద్ కన్వీనర్‌గా వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మాల సంఘాలు, మాల విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు హాజరయ్యారు.