పైసల కోసమెళ్లిన వ్యక్తి బావిలో శవమైండు!..మహబూబాబాద్ జిల్లా గుండెంగలో ఘటన

పైసల కోసమెళ్లిన వ్యక్తి బావిలో శవమైండు!..మహబూబాబాద్ జిల్లా గుండెంగలో ఘటన
  • గూడూరు పోలీసుల అదుపులో అనుమానితుడు!

గూడూరు, వెలుగు: పైసలు అడగడానికి వెళ్లిన వ్యక్తి అనుమానాస్పదంగా బావిలో శవమై తేలిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన తేజావత్ భద్రునాయక్(45) మంగళవారం తనకు పైసలు ఇవ్వాల్సిన వ్యక్తిని అడిగేందుకు ఇంటికి వెళ్లి సాయంత్రం వరకు తిరిగిరాలేదు. దీంతో అనుమానించిన భద్రునాయక్ భార్య బంధువులు ఇండ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు.

తన భర్త కనిపించడంలేదని  గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం గుండెంగ శివారులోని బావిలో భద్రు నాయక్ డెడ్ బాడీ కనిపించింది. స్థానికులు పోలీసులకు తెలపగా గూడూరు సర్కిల్ పోలీసులు వెళ్లి డెడ్ బాడీని బయటకు తీయించి పోస్టుమార్టం కోసం నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. కాగా.. భద్రునాయక్ ను ఓ వ్యక్తి చంపి బావిలో వేసినట్టు,  అతనే పోలీసులకు చెప్పినట్టుగా స్థానికంగా చర్చ జరుగుతుంది. అనుమానితుడు పోలీసులు అదుపులో ఉన్నట్టు సమాచారం. ఘటనపై  పోలీసులను అడగగా కేసు దర్యాప్తులో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.