
- రెండేండ్లలో పూర్తి చేయాలని
- స్పష్టం చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: గోషామహల్‌లో నిర్మించనున్న ఉస్మానియా కొత్త హాస్పిటల్ టెండర్ ను మేఘా కంపెనీ దక్కించుకుంది. ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచి అదే నెల 27వ తేదీ వరకు ఆర్ అండ్ బీ అధికారులు టెండర్లు పిలిచారు. ఈ నెల మొదటి వారంలో టెండర్లు ఓపెన్ చేశారు. మొత్తం నాలుగు కంపెనీలు టెండర్లు దాఖలు చేయగా.. వాటి వివరాలను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) కు పంపారు. ఇటీవల సీవోటీ ఆమోద ముద్ర వేసింది. నాలుగు కంపెనీల్లో తక్కువగా కోట్ చేసిన మేఘా కంపెనీ టెండర్దక్కించుకుంది.
కంపెనీతో ఆర్ అండ్ బీ అధికారులు తాజాగా లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ( ఎల్ వో ఏ ) ప్రక్రియ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఉస్మానియా కొత్త జనరల్ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరి 31న శంకుస్థాపన చేశారు. రూ.2,700 కోట్ల నిధులతో 26 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల చదరపు అడుగులలో 2 వేల పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. రెండేండ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.