అచ్చుగుద్దినట్లు జాక్సన్‌లా ఉన్న మేనల్లుడు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న మైఖేల్ ట్రైలర్

అచ్చుగుద్దినట్లు జాక్సన్‌లా ఉన్న మేనల్లుడు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న  మైఖేల్ ట్రైలర్

ప్రపంచ సంగీత ప్రియుల ఆరాధ్య దైవం, డాన్స్ ఐకాన్ మైకేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మైఖేల్’. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్‌‌గా ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించాడు. ఆస్కార్ విజేత గ్రాహమ్ కింగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఫైనల్ ట్రైలర్'ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. 

 జాఫర్ జాక్సన్‌‌ లుక్‌‌, బాడీ లాంగ్వేజ్ మొదలు డాన్స్ మూమెంట్స్ వరకు మేనమామ మైఖేల్ జాక్సన్‌‌ను తలపించాయి.  ముఖ్యంగా 'థ్రిల్లర్', 'బీట్ ఇట్', 'బిల్లీ జీన్' వంటి ఐకానిక్ పాటల్లో జాక్సన్ కనబరిచిన హావభావాలు, మూన్‌‌వాక్ విన్యాసాలు చూస్తుంటే మైఖేల్ మళ్ళీ తిరిగి వచ్చాడా అనిపించేలా ఉన్నాయి.  ఆయన చిన్నతనం నుంచి గ్లోబల్ సూపర్ స్టార్‌‌గా ఎదిగిన తీరు, ఎదుర్కొన్న ఒడిదుడుకులు, వ్యక్తిగత జీవితంలోని వివాదాలను ఇందులో టచ్ చేశారు. 

 కేవలం విజయాలే కాకుండా, అంతర్గత సంఘర్షణను కూడా ఈ ట్రైలర్‌‌లో ఎమోషనల్‌‌గా చూపించారు. కోల్‌‌మన్ డొమింగో, నియా లాంగ్, మైల్స్ టెల్లర్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.