
- దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్/ఖిలా వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్లో వరద సమస్యలకు నాలాల ఆక్రమణలే కారణమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం మంత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రూ.5 కోట్ల 87 లక్షల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరంగల్లో వరద సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. పనుల కోసం రూ.178 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
త్వరలో సిటీ అంతటా అండర్‍గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే వరద సమస్యే ఉండదని చెప్పారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు ముందుకెళ్తున్నామన్నారు. మేడారం జాతర కోసం గతంలో రూ.130 కోట్లు ఇవ్వగా ఇప్పుడు రూ.150 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, కమిషనర్ చాహత్ బాజ్‍పాయ్ పాల్గొన్నారు.
సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన
ఖిలా వరంగల్ (మామునూరు) వెలుగు: తూర్పు నియోజకవర్గంలో రూ 5.87 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయితో కలసి శంకుస్థాపన చేశారు. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ నిధులు, ఎస్ ఎఫ్ సీ పథకాల కింద రూ. 4.87 కోట్లతో 32వ డివిజన్ బీఆర్ నగర్‌లో బస్తీ దవాఖాన, ఎన్ ఎన్ నగర్ లో సీసీ రోడ్లు, జ్యోతినగర్‌లో సీసీ రోడ్లు, అంబేద్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, రంగశాయిపేటలో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.