ఏదులాపురం మున్సిపాలిటీలో మండల కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఏదులాపురం మున్సిపాలిటీలో మండల కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ఏదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి పర్యటన 
  • తరుణీ హాట్ లో నిర్మిస్తున్న కార్యాలయ పనుల పరిశీలన

ఖమ్మం రూరల్, వెలుగు : ఏదులాపురం మున్సిపాలిటీలో నిర్మిస్తున్న సమీకృత మండల కార్యాలయాలలో సకల సౌకర్యాలు ఉండేలా ప్రణాళిక తయారు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి తరుణీ హాట్ లో నిర్మిస్తున్న సమీకృత మండల కార్యాలయ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీకృత మండల కార్యాలయ సముదాయ నిర్మాణ స్థలం పూర్తి స్థాయిలో చదును చేయాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ మొదలగు అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సముదాయం ఉండాలని చెప్పారు. 

అంతర్గతంగా 30 ఫీట్ల రోడ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మండల కార్యాలయ సముదాయానికి అవసరమైయ్యే విద్యుత్ సోలార్ ప్యానెల్ ద్వారా ఏర్పాటు సమకూర్చుకునేలా ప్లాన్ లో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా తాగునీటి సరఫరా కనెక్షన్ తీసుకోవాలన్నారు. ప్రతి ఫ్లోర్ లో ప్రజలకు వెయిటింగ్ ఏరియా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేశ్, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ. శ్రీనివాస రెడ్డి, ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ రాంప్రసాద్,  తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి  నూతన గృహప్రవేశం 

కల్లూరు : మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సతీమణి మాధురి దంపతులు కల్లూరు మండల పరిధి నారాయణపురం స్వగ్రామంలో నూతనంగా నిర్మించిన భవనంలో గురువారం తెల్లవారుజామున గృహప్రవేశం చేశారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీ లక్ష్మి దంపతులతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి  వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా లక్ష్మీ గణపతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానాలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు, తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్, కల్లూరు, పెనుబల్లి ఎస్సైలు డి హరిత, ఎన్ వెంకటేశ్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.