- ఏనాడైనా వాళ్ల బాగోగులు పట్టించుకున్నవా?.. కేసీఆర్‌పై మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్
- వందరోజుల్లో ప్రభుత్వాన్ని కూడా కేసీఆర్ ఏర్పాటు చేయలే
- మేము మాత్రం హామీలు అమలు చేస్తున్నం
- ఇప్పుడు వందరోజులకే ఐదేండ్లు అయిపోయినట్టు మాట్లాడుతున్నడు
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు
- వంశీని గెలిపించి సోనియమ్మకు గిఫ్ట్ ఇద్దాం: మంత్రి సీతక్క
- మంచిర్యాలలో పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ ముఖ్య కార్యకర్తల మీటింగ్
మంచిర్యాల, వెలుగు: 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు పూర్తి మెజారిటీ ఇచ్చినప్పటికీ వంద రోజుల్లో సరిగా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయలేదని, తాము మాత్రం సర్కారు కొలువుదీరిన రెండు రోజుల నుంచే హామీలను అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదింటిని అమలు చేశామని, మేనిఫెస్టోలోని అంశాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్నామని, ఎంపీ ఎన్నికల కోడ్ రావడంతో కొంత ఆలస్యమవుతోందని చెప్పారు. వంద రోజులకే ఐదేండ్ల పాలన అయిపోయినట్టు మహిళలకు రూ.2,500 ఎప్పుడిస్తారని కేసీఆర్ అడగడం విడ్డూరంగా ఉందన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ప్రవేశపెట్టాక సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని, అప్పటిదాకా ఆగే ఓపిక కేసీఆర్‌కు లేదని విమర్శించారు. వచ్చే ఐదేండ్లలో హామీలన్నీ అమలు చేసి వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడుగుతామన్నారు.
ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఆధ్వర్యంలో పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్హాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి మంత్రి సీతక్కతో కలిసి శ్రీధర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెల్లంపల్లి, చెన్నూరు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్జనక్ ప్రసాద్, బి.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైంది. కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం’’ అన్నారు. పదేండ్లలో ఏనాడూ రైతుల బాగోగులు పట్టించుకోని బీఆర్ఎస్ లీడర్లు.. ఇప్పుడు రైతు ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు 10 కిలోలు కటింగ్ పెట్టి రైతులను లూటీ చేశారన్నారు. రైతుబంధు పేరుతో ఎకరానికి రూ.10 వేలు దోచుకున్నారన్నారు. కాంగ్రెస్‌తో కరువు రాలేదని, కాళేశ్వరం బ్యారేజీలు కుంగిపోతే కాంగ్రెస్‌ను బద్నాం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలే బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయని, నీళ్లు వదిలిపెట్టాలని చెప్పాయన్నారు. నిపుణుల సూచనల మేరకే కాళేశ్వరంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. నేతకాని, ఉపకులాలకు, సంచార జాతులకు కార్పొరేషన్ల అంశం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిలో ఉందని, వీటిపై మంత్రి పొన్నం ప్రభాకర్ రిపోర్టు ఇవ్వనున్నారని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాంచ్న్యాయ్లో భాగంగా అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు.
పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి..
పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ‘‘యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే సంకల్పంతో ఉన్న గడ్డం వంశీకృష్ణను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించింది. కాకా వెంకటస్వామి మనుమడిగా, వివేక్ వెంకటస్వామి కొడుకుగా, యువతకు స్ఫూర్తిగా నిలువాలని రాజకీయాల్లోకి వచ్చిండు. కొంతమంది రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వచ్చిండని అంటున్నరు. కానీ అతడు చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్నడు. తనకున్న అనుభవం, నైపుణ్యం, మేధాశక్తితో ఈ ప్రాంత యువతకు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆశయంతో ఉన్నడు. ప్రజాసేవ కోసం వచ్చిన వంశీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్పరిధిలోని ఎమ్మెల్యేలందరం ఆయనకు మద్దతునిస్తున్నాం. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో బేరీజు వేసుకొని ఓటు వేయండి. మీలో ఒకడిగా ఉంటడు. ఢిల్లీలో ఏ పని ఉన్నా చేసి పెడ్తడు. గ్రామాలకు వెళ్లి వంశీ గురించి ప్రజలకు చెప్పండి. మీరందరు అతడిని ఆశీర్వదించండి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే డబుల్ మెజారిటీతో గెలిపించండి’’ అని పిలుపునిచ్చారు.
వంశీని గెలిపిద్దాం: మంత్రి సీతక్క
తాత కాకా వెంకటస్వామి పేరు నిలబెడుతూ ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించి సోనియమ్మకు గిఫ్ట్ ఇద్దామని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ‘‘34 ఏండ్ల తర్వాత ఇందిరమ్మ ఫ్యామిలీ నుంచి రాహుల్ ప్రధాని కావాలంటే వంశీ లాంటి వారిని ఎంపీలుగా గెలిపించాలి. ప్రతి బూత్‌లో అత్యధిక మెజారిటీ తీసుకురావాలి’’ అని అన్నారు. ‘‘కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ప్రజలకు మేలు జరిగే చట్టాలు వస్తాయి. కాంగ్రెస్ ఉపాధి చట్టం తేకుంటే ఊర్లల్లో రోడ్లు ఉండేవి కావు. మోదీ ప్రభుత్వం అటవీ హక్కులకు తూట్లు పొడిచింది. మోదీకి అదానీ, అంబానీ తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించే ప్రయత్నం చేస్తున్నరు. దేశ వనరులను దోస్తులకు దోచిపెడుతున్నడు’’ అని విమర్శించారు. పేదలకు అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్‌లను పక్కదారి పట్టించడం కోసం కేసీఆర్ దొంగ రైతు దీక్షలు చేయిస్తున్నాడని ఆరోపించారు. వంశీ గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉంటారని హామీ ఇచ్చారు.
వంశీని చూస్తుంటే కాకాను చూసినట్టు ఉంది: ప్రేమ్‌సాగర్ రావు
వంశీని చూస్తుంటే వాళ్ల తాత కాకా వెంకటస్వామిని చూసినట్టు ఉందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజారిటీ అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ఇంద్రవెల్లి గిరిజన దండోరా సభ స్ఫూర్తిగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఓవైపు రైతుబంధు ఇచ్చి, మరోవైపు వడ్ల తరుగు పేరుతో కటింగ్ చేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ దోపిడీని అరికట్టామని చెప్పారు. నీటి కొరత ఉన్నప్పటికీ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గూడెం లిఫ్టు ద్వారా సాగునీళ్లిచ్చి పంటలను కాపాడామన్నారు. ఎంపీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 75 శాతం కాంగ్రెస్‌కు వస్తే, ఆ గ్రామాలను స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం చేస్తామని ప్రకటించారు.
ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి: వినోద్
‘‘మా ఫ్యామిలీ కాంగ్రెస్‌కు చేసిన సేవలను గుర్తించి పార్టీ హైకమాండ్ వంశీకృష్ణకు పెద్దపల్లి ఎంపీగా చాన్స్ఇచ్చింది. వంశీని ఆశీర్వదించండి. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి’’ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే పార్టీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
మా ఓట్లు వంశీకేనని సంఘాల తీర్మానం..
ఎంపీ ఎన్నికల్లో వంశీకృష్ణను గెలిపిస్తామని వివిధ సంఘాల నాయకులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి మంత్రి శ్రీధర్‌బాబుకు అందజేశారు. పెరిక, మున్నూరు, పద్మశాలి, యాదవ, గంగపుత్ర, రజక, నాయీబ్రాహ్మణ జిల్లా సంఘాలతో పాటు గొల్ల కురుమ హక్కుల పోరాట సంఘం, ఐఎన్టీయూసీ ఈ మేరకు తీర్మానాలు చేశాయి.
తెలంగాణ కోసం మా కుటుంబం కొట్లాడింది: వివేక్
తెలంగాణ ఉద్యమంలో తండ్రి వెంకటస్వామి, అన్న గడ్డం వినోద్‌తో పాటు తాను పోరాటం చేశానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘మా కుటుంబం తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఎవరూ ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు వంశీకి టికెట్ ఇవ్వగానే కుటుంబం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది” అని అన్నారు. ‘‘కాకా వెంకటస్వామి నాడు సింగరేణిలో లక్ష ఉద్యోగాలు కాపాడారు. జైపూర్ పవర్ ప్లాంట్‌తో 5 వేలు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో మరో 5 వేల ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రాంతంలో కొత్త మైన్స్ ఏర్పాటు చేయాలి. జైపూర్ పవర్ ప్లాంట్ ఎక్స్‌టెన్షన్‌తో మరో 5 వేల ఉద్యోగాలు వస్తయి. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కృషి చేస్తాం” అని అన్నారు. ‘‘వంశీని గెలిపిస్తే కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ తీసుకొస్తడు. ప్రేమ్ సాగర్ రావు 3 నెలల్లోనే మంచిర్యాలకు రూ.200 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చారు. ఆయన బాటలో వంశీ నడుస్తడు” అని చెప్పారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కాకా చొరవేనని తెలిపారు. రూ.11 వేల కోట్ల ఖర్చుతో కాల్వలు తవ్వారని, మరో రూ.24వేల కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు, మిషన్ భగీరథ పేరిట రూ.45వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
పదేండ్లుగా ప్రజాసేవ చేస్తున్నా: గడ్డం వంశీకృష్ణ
తాను పదేండ్లుగా విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. తన తాత కాకా హయాం నుంచి ఈ ప్రాంతంతో తమ ఫ్యామిలీకి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. వెంకటస్వామి సింగరేణికి రూ.450 కోట్ల లోన్ మాఫీ చేయించి లక్ష ఉద్యోగాలను కాపాడారన్నారు. పేదలకు 70 వేల ఇండ్లు కట్టించి గుడిసెల వెంకటస్వామిగా పిలిపించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే పెన్షన్, రేషన్ సిస్టం అమల్లోకి వచ్చాయన్నారు. గత పదేండ్లలో బీఆర్ఎస్ను నమ్మితే ఇసుక దందా, భూదందా చేసి దోచుకున్నారని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. మీ ఆశీర్వాదం కావాలి. ప్రేమ్ సాగర్ రావు మీద చూపించిన ప్రేమలో కొంచెం నా మీద చూపించినా చాలు” అని అన్నారు. కాకా వెంకటస్వామికి ప్రేమ్‌సాగర్‌రావు తండ్రి రఘుపతిరావుతో మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో తనను గెలిపిస్తే జిల్లాలోని సమస్యల పరిష్కారం కోసం, సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను రద్దు కోసం, ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.