
- అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశం
- ప్రతి నెలా 175 మీటర్ల తవ్వకం చేపట్టాలి
- అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులను పున:ప్రారంభించాలని అధికారులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. 2028 జనవరి నాటికి పనులు పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో అన్ని భద్రతా ప్రమాణాలను పాటించాలని తెలిపారు. బుధవారం సెక్రటేరియెట్‌లో ఎస్ఎల్బీసీ పనులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ గౌరవ సలహాదారుగా లెఫ్టినెంట్ జనరల్ హర్‌పాల్‌సింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సమీక్షలో ఆయన కూడా పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా జియోలాజికల్ సర్వేలు, పనుల పునరుద్ధరణ వ్యూహాలు, భద్రతా చర్యలపై చర్చించారు. రివైజ్డ్ ప్లాన్, ఆర్థిక అంచనాల ప్రకారం పనులు చేయాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ సూచించారు. ప్రతినెలా 175 మీటర్ల మేర టన్నెల్ తవ్వకం చేపట్టాలన్నారు. గురువారం ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి రివ్యూ చేస్తారని తెలిపారు.
ప్రపంచంలోనే లేటెస్ట్ టెక్నాలజీ అయిన హెలిబార్న్ సర్వే చేయిస్తున్నామని పేర్కొన్నారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ) హెలికాప్టర్‌తో సర్వే చేసి.. టన్నెల్ ప్రాంతంలో షియర్ జోన్లు, బలహీనమైన రాతి ప్రాంతాలు, ఫాల్ట్ లైన్స్‌ను గుర్తిస్తుందని చెప్పారు. తద్వారా టన్నెల్‌లో ఎక్కడెక్కడ రిస్క్ ఉందో తెలుసుకోవడం అధికారులు సులభమవుతుందని తెలిపారు. సర్వేను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టాలని, టైమ్ ఫిక్స్చేయాలని అధికారులను ఆదేశించారు.
సవరించిన బడ్జెట్‌లోనే పూర్తవ్వాలి
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును ప్రస్తుతం సవరించిన అంచనాల బడ్జెట్‌లోనే పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఆ విధివిధానాలను స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలన్నారు. మరో ప్రమాదం రాకుండా చూడాలని, ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టును టైమ్‌లోపు పూర్తి చేస్తేనే లక్షలాది మంది రైతులకు నీళ్లు అందుతాయన్నారు.
వెంటిలేషన్ మెథడాలజీ కీలకం: హర్‌పాల్‌సింగ్
టన్నెల్‌లో వెంటిలేషన్, డాక్యుమెంటేషన్ మెథడాలజీ చాలా కీలకమని లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్సింగ్పేర్కొన్నారు. రాష్ట్రంలో యువ ఇంజినీర్లకు ఇలాంటి వ్యవస్థలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. టన్నెల్‌లో ఒక చివరి నుంచి 21 కిలోమీటర్లు, మరో చివరి నుంచి 14 కిలోమీటర్ల మేర పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు వివరించారు.