భగీరథ నీళ్లొస్తలేవని ట్యాంక్ ఎక్కిన సర్పంచ్

భగీరథ నీళ్లొస్తలేవని ట్యాంక్ ఎక్కిన సర్పంచ్
  •     సిద్దిపేట జిల్లా అయినాపూర్​లో సర్పంచ్​, గ్రామస్తుల ఆందోళన

కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఆయినాపూర్ గ్రామంలో మంగళవారం మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని సర్పంచ్, గ్రామస్తులు వాటర్​ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సర్పంచ్ చెరుకు రమణారెడ్డి మాట్లాడుతూ ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లను సరఫరా చేస్తున్నామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు తమ గ్రామానికి వచ్చి చూడాలన్నారు. మిషన్ భగీరథ ట్యాంకును సిబ్బంది సరిగ్గా నింపడం లేదని, దీంతో నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ట్యాంక్ వద్ద గేటు లీకేజీ సమస్య ఉందన్నారు.

ట్యాంకును ఒకసారి నింపి ఫొటోలు తీసుకుని రోజూ నింపుతున్నట్టు పై అధికారులకు పంపిస్తున్నారని ఆరోపించారు. నీళ్లు లేకపోవడంతో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలోని బోర్లతో ట్యాంకులను నింపి కాలనీలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఆ కరెంట్​బిల్లులు కూడా గ్రామ పంచాయతీనే కడుతోందన్నారు. ఊరి చుట్టూ ఏడు పెద్ద చెరువులు, రిజర్వాయర్ తో గ్రౌండ్ వాటర్ ఫుల్లుగా ఉన్నా అధికారులు నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడక తప్పడం లేదన్నారు. అధికారులు తమ గ్రామంలో పర్యటిస్తే తమ కష్టాలు తెలుస్తాయన్నారు. విషయం తెలుసుకున్న డీఈ అనిల్ కుమార్ ఫోన్ ​చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.