నిధులు తెచ్చి.. జడ్చర్లను అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

నిధులు తెచ్చి.. జడ్చర్లను అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు: వరద కష్టాలను శాశ్వతంగా తొలగించేందుకు అవసరమైన నిధులను తెచ్చి.. జడ్చర్ల పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. వరద నీటి కాల్వల నిర్మాణానికి ఇప్పటికే రూ.14 కోట్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం రోడ్లు, డ్రెయిన్ల కోసం రూ.12.5 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మరో రూ.70 కోట్లు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జడ్చర్లలో వరద కాల్వల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జడ్చర్ల, బాదేపల్లి, కావేరమ్మపేటను అభివృద్ధి చేస్తానన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు కూడా తమ ప్రాంతానికే నిధులన్నీ ఇవ్వాలని పట్టుబట్టకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

 ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు గతంలో బీఆర్​ఎస్​నేతల సహకారంతో తాము వేసిన లేఅవుట్లలో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలను కల్పించకుండానే మార్టిగేజ్ ను విడిపించుకుపోయారని ఆరోపించారు. వాళ్లు చేయాల్సిన పనుల భారం ఇప్పుడు తమపై పడిందన్నారు. కొందరు రియల్ ఎస్టేట్​వ్యాపారుల పేర్లను ప్రస్తావిస్తూ.. పనులు చేయకుండా తప్పించుకుపోయిన వారిని నిలదీయాలని ప్రజలకు సూచించారు. మున్సిపల్ చైర్​పర్సన్​కోనేటి పుష్పలత, కమిషనర్ లక్ష్మారెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.