ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మార్కులు తెచ్చుకోవాలి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా మార్కులు తెచ్చుకోవాలి  : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చండూరు (మర్రిగూడ), వెలుగు : ప్రభుత్వ పాఠశాల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్​కు దీటుగా మార్కులు తెచ్చుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థినులకు నగదు బహుమతి అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–-26 విద్యాసంవత్సరంలో పదో తరగతిలో మొదటి స్థానం వచ్చినవారికి రూ.25 వేలు, రెండో స్థానానికి రూ.15 వేలు, మూడో స్థానానికి రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తామన్నారు.

 విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. విద్యార్థినులకు సరిపడా బాత్రూమ్స్, డార్మిటరీ హాల్స్ లేవని, ఒక్క రూమ్​లో 60 మంది పడుకోవాల్సి వస్తుందని సిబ్బంది.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే తన సొంత నిధులతో ఖాళీగా ఉన్న ఫస్ట్ ఫ్లోర్ పై నాలుగు రూమ్స్, బాత్రూమ్స్ కూడా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఇప్పటివరకు 682 మందికి కంటి ఆపరేషన్లు చేయించామని, 10 వేల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీలు పాశం సురేందర్ రెడ్డి, మేతరి యాదయ్య, పాల్వాయి అనిల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.