సెంట్రల్‌‌‌‌ టీం ముందు మోరంచపల్లి బాధితుల ఆవేదన

సెంట్రల్‌‌‌‌ టీం ముందు మోరంచపల్లి బాధితుల ఆవేదన
  • గాఢ నిద్రలో ఉండంగ  ముంచేసింది
  • ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎక్కడోళ్లం అక్కడ ఇండ్లెక్కినం.. 
  • అప్పటికే నలుగురు కొట్టుకుపోయిన్రు మీరైనా మమ్మల్ని ఆదుకోండి సారూ..!
  • సెంట్రల్‌‌‌‌ టీం ముందు మోరంచపల్లి బాధితుల ఆవేదన
  • భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో టీమ్​ పర్యటన

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి,  వెలుగు:  వరద నష్టాన్ని పరిశీలించేందుకు వచ్చిన సెంట్రల్​ టీమ్​ ముందు మోరంచపల్లి వరద బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చనిపోయినవాళ్లను తలుచుకొని విలపించారు. వరద బాధితుల గోసను చూసి సెంట్రల్‌‌‌‌ టీమ్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ చలించిపోయారు. ‘‘గాఢనిద్రలో ఉండగానే ఇండ్లలోకి నీళ్లొచ్చినయ్​..  ఇంకా కొంచెం సేపయితే అందరం కొట్టుకుపోయి ఊరంతా వళ్లకాడు అయ్యేది. ఒక్కరం కూడా బతికేటోళ్లం కాదు. అప్పటికే నల్గురు కొట్టుకుపోయిన్రు. వందల బర్లు సచ్చిపోయినయ్​..  సర్వం కోల్పోయి అనాథలుగా మిగిలినం.. సర్కారు ఆదుకోకపోతే మాకు చావే దిక్కు సారూ’’ అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అథారిటీ జాయింట్ సెక్రటరీ  కునాల్ సత్యార్థి ఆధ్వర్యంలో ఫైనాన్స్  డిప్యూటీ సెక్రటరీ అనిల్ గైరోల, ఎన్ హెచ్ రీజినల్ ఆఫీసర్  ఎస్.కె. కుష్వా, జలశక్తి మంత్రిత్వశాఖ  డైరెక్టర్ రమేశ్​కుమార్, కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ పూనుస్వామి,  ఎన్ఆర్​ఎస్సీ  డైరెక్టర్ జె.శ్రీనివాసులు, పవర్ డిపార్ట్​మెంట్​ ప్రతినిధి భవ్య పాండే బుధవారం భూపాలపల్లి, ములుగు జిల్లాలో పర్యటించారు.  ఆయా జిల్లాల కలెక్టర్లు పవర్‌‌‌‌ పాయింట్‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌ ద్వారా వరద నష్టాన్ని వివరించారు. భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిని, ములుగు జిల్లా పస్రాలోని గుండ్ల వాగు వద్ద ధ్వంసం అయిన నేషనల్​హైవేను సెంట్రల్‌‌‌‌ టీమ్‌‌‌‌ పరిశీలించింది. నష్టం గురించి  స్థానిక ఆఫీసర్లను అడిగి తెలుసుకుంది. 

ఏ ఒక్కరిని కదిలించినా కన్నీళ్లే

సెంట్రల్​ టీమ్​ కలిసినప్పుడు భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వరద బాధితులు వరద కష్టాన్ని తల్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. ‘‘50 లక్షలు అప్పు తెచ్చి కట్టుకున్న కొత్త ఇల్లు సార్‌‌‌‌ ఇది.. ఇంటితోపాటు పాలిచ్చే పది బర్రెలుకూడా వరదల్లో కొట్టుకుపోయినయ్​” అంటూ వరద బాధితురాలు కొత్త కమల బోరున విలపించింది. ‘‘కొత్తింట్లకు వచ్చి నాలుగు రోజులు కాకముందే వరదచ్చి అంతా ఊడ్చుకొనిపోయింది. ఇల్లు కట్టిన సంబురం లేదు.  కట్టుబట్టలతో మిగిలినం. అప్పులు ఎట్లా  తీర్చాల్నోనని బుగులైతున్నది. ప్రభుత్వం ఆదుకోకపోతే చావే దిక్కు” అని ఆమె వాపోయింది. ‘‘ఒక్కసారిగా వరద వచ్చి ఇంటిని ముంచెత్తింది. ఎంబడే తేరుకొని బర్రెలు, కోళ్లను ముల్లె మూటను విడిచిపెట్టి ఇండ్ల పైకెక్కి  బిక్కు బిక్కు మంటూ గడిపినం. ఇంట్ల వస్తువులన్నీ నీళ్లపాలైనయ్. నెలకు సరిపడా సరుకులు ఇచ్చి సర్కారు చేతులు దులుపుకుంది. మీరైనా ఆదుకోండి” అంటూ బాధితుడు సంకి వీరస్వామి వేడుకున్నారు. ‘‘మా ఇంటి పక్కన గుడిసెలో మా అమ్మ ఉండేది. మోరంచవాగు ఉప్పొంగడంతో  గుడిసె తో పాటు మా అమ్మ గంగిడి సరోజన కొట్టుకుపోయింది. మూడు రోజుల తర్వాత ఆమె  శవం దొరికింది’’ అని దోర కళావతి కన్నీటి పర్యంతమైంది.

నా కండ్ల ముందే భార్య కొట్టుకుపోయింది 

‘‘మోరంచవాగు వరద ఒక్కసారి  రావడంతో భార్యాభర్తలం ఇంట్లో నుంచి బయటకొచ్చినం. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఒక చెట్టును పట్టుకున్నం..  చెట్టు వంగిపోతుండడంతో పక్కనే ఉన్న ఒక సిమెంట్ పోల్‌‌‌‌ను పట్టుకొని సాయం కోసం ఎదురుచూసినం. అప్పుడే నీళ్లలో కొట్టుకొస్తున్న ఒక బర్రె నా భార్యను తాకడంతో ఆమె రెండు చేతులు వదిలిపెట్టింది. చూస్తుండగానే నీళ్లలో కొట్టుకుపోయింది. వారం రోజులైనా ఇంకా  ఆమె ఆచూకీ దొరకలేదు. రోజూ ఆమె కోసం  ఏడుస్తున్నం సారూ..’’  అంటూ సెంట్రల్​ టీమ్​ ముందు మోరంచపల్లి వరద బాధితుడు గడ్డం శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.