
మంచిర్యాల, వెలుగు: సీఎం సభ ఏర్పాట్ల కోసం మున్సిపల్ వాటర్ ట్యాంకర్లను వినియోగిస్తుండడంతో జిల్లా కేంద్రంలోని పలు కాలనీల ప్రజలు నీళ్లు లేక గోస పడుతున్నారు. ఈ నెల 9న సీఎం కేసీఆర్ కొత్త కలెక్టరేట్ ను ఓపెన్చేయనుండడంతో కలెక్టరేట్ఆవరణలో రోడ్లు, గ్రీనరీ ఏర్పాటు, మొక్కలు నాటే పనులు చేపడుతున్నారు. ఈ పనులకు మున్సిపల్ వాటర్ట్యాంకర్ల ద్వారా వాటర్ సప్లై చేస్తున్నారు. ఓవైపు జిల్లా కేంద్రంలోని ఒడ్డెర కాలనీ, హమాలివాడ, దొరగారిపల్లె, గొల్లవాడ, సుందరయ్య కాలనీతో పాటు శివారు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు.
Also read:డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ తప్పించుకోబోయి.. బస్సు కింద పడి యువకుడు మృతి
మరోవైపు అధికారులు ఆయా కాలనీలకు వాటర్ సప్లై బంద్‌చేసి మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా తాగునీటితో కలెక్టరేట్ఆవరణలోని మొక్కలను తడుపుతున్నారు. రెండు రోజులుగా ట్యాంకర్లు రాకపోవడంతో ప్రజలు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం కొంతమంది ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరలోని వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లి ట్యాంకర్ల గురించి ఆరా తీశారు. తాము తాగునీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే అధికారులు మాత్రం సీఎం సభ ఏర్పాట్ల కోసం మున్సిపల్ ట్యాంకర్లు వాడుతున్నారని మండిపడ్డారు. దీంతో మున్సిపల్ అధికారులు ఆయా కాలనీలకు ఒకట్రెండు ట్యాంకర్లు పంపించారు.