హత్య కేసులో నిందితుల అరెస్ట్ : డీఎస్పీ శ్రీనివాస్

హత్య కేసులో నిందితుల అరెస్ట్ :  డీఎస్పీ శ్రీనివాస్

వివరాలు వెల్లడించిన నాగర్​కర్నూల్​ డీఎస్పీ శ్రీనివాస్ 

కోడేరు, వెలుగు: హత్యకేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. శుక్రవారం సాయంత్రం పెద్దకొత్తపల్లి పీఎస్​లో నాగర్​కర్నూల్​ డీఎస్పీ శ్రీనివాస్​ ప్రెస్​మీట్​ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కోడేర్​ మండలం మైలారం గ్రామానికి చెందిన అనుముల రంగస్వామి (45)కు అచ్చంపేటకు చెందిన ఏదుల పులేందర్​గౌడ్​కు నాలుగు నెలల కింద పరిచయం ఏర్పడింది. రంగస్వామి తనకు తెలిసిన స్వామీజీ గుప్త నిధులు వెలికి తీస్తాడని నమ్మించి, ఈ విషయాలు మాట్లాడుకునేందుకు ఒక ఫోన్​ ఇచ్చాడు.

ఆయన మాటలు నమ్మిన పులేందర్​ రూ. 5లక్షలు స్వామీజీకి ఇవ్వాలని అందజేశాడు. ఆ తర్వాత రంగస్వామి మరో రూ.5 లక్షలు ఇవ్వాలని, ఇవ్వకపోతే స్వామీజీ కన్నెర్ర చేస్తే చస్తావంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో రంగస్వామిని చంపాలని డిసైడ్​ అయిన పులేందర్​ సన్నిహితులైన రమేశ్, శివ, కర్నాటి సుధాకర్, జక్కుల తిరుపతయ్య, పాలుస భాస్కర్​ గౌడ్, సలేశ్వర్​ గౌడ్​తో కలిసి పథకం పన్నాడు. గత నెల 29న డబ్బులు ఇస్తానని నమ్మించి మహబూబ్​నగర్​ తీసుకెళ్లారు. అక్కడ సలేశ్వర్​గౌడ్​ ఇంట్లో చికెన్​లో అల్ఫ్రాజోలం కలిపి ఇవ్వడంతో రంగస్వామి స్పృహ కోల్పోయాడు. అక్కడి నుంచి మైలారంలోని భాస్కర్​గౌడ్​ మామిడితోటకు తీసుకెళ్లి దాడి చేసి గుంతలో పూడ్చేశారు.

అనంతరం మద్యం తాగి వెళ్లిపోయారు. రంగస్వామి కనిపించకపోవడంతో అతడి భార్య అరుణ కోడేర్​ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. పులేందర్​గౌడ్​పై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడి కాల్​డాటా ఆధారంగా అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో హత్య చేసినట్లుగా అంగీకరించడంతో మొత్తం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా రమేశ్​అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఆరు మొబైల్స్, తుఫాన్​ వాహనం, శవాన్నిపూడ్చడానికి వినియోగించిన గడ్డపారలు స్వాధీనం చేసుకున్నామని, నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వివరించారు. ప్రెస్​మీట్​లో కోడేరు ఎస్సై డి.జగదీశ్వర్, పెద్దకొత్తపల్లి ఎస్సై వి.సతీశ్​ తదితరులున్నారు.