మంత్రిగా జగదీశ్రెడ్డి చేసింది శూన్యం

మంత్రిగా జగదీశ్రెడ్డి చేసింది శూన్యం

నల్గొండ అర్బన్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మంత్రిగా పని చేసిన జగదీశ్​రెడ్డి జిల్లా అభివృద్ధికి చేసింది శూన్యమని డీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఎద్దేవా చేశారు. మంత్రులపై జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన  ఖండించారు. బుధవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్​ఆఫీస్​లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాటలను జిల్లా ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎమ్మెల్సీ కవిత ఆయనను లిల్లీపుట్​అని చెప్పారని గుర్తు చేశారు. 

బీఆర్ఎస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన సాగించి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకపోతోందన్నారు. నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత డబ్బులు రూ.కోటి ఖర్చు చేసి, కాలువల్లో చెట్లు, పూడిక తీయించారని తెలిపారు. ఎస్ఎల్బీసీ, డిండి, నక్కల గండి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేస్తామన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి మంత్రి అయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం వస్తున్నాయని తెలిపారు. మంత్రులను విమర్శించే స్థాయి జగదీశ్​రెడ్డికి లేదన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నాయకులు కత్తుల కోటి, రామ్ రెడ్డి, మామిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.